నగ్న ఫొటోలు, వీడియో: ఆపిల్‌ కంపెనీకి కోట్ల జరిమానా

7 Jun, 2021 16:33 IST|Sakshi

కాలిఫోర్నియా: ఓ విద్యార్థిని నగ్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఐ ఫోన్‌ సంస్థ కొన్ని కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. ఓ విద్యార్థిని తన ఫోన్‌ రిపేర్‌కు వచ్చిందని సర్వీస్‌ సెంటర్‌కు ఇచ్చింది. అయితే ఫోన్‌ రిపేర్‌లో ఉన్నప్పుడే ఆమెకు సంబంధించిన నగ్న ఫొటోలు, వీడియోలు ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి ఉన్నాయి. వీటిని చూసి షాక్‌కు గురయిన ఆ యువతి ఐఫోన్‌ కంపెనీపై పోరాటం చేసింది. తత్ఫలితం ఆపిల్‌ కంపెనీ కొన్ని కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

2016లో కాలిఫోర్నియాలోని ఒరెగాన్‌కు చెందిన ఓ విశ్వవిద్యాలయ విద్యార్థిని తన ఫోన్‌ రిపేర్‌కు రావడంతో సమీపంలోని పెగాట్రాన్‌ సంస్థ నిర్వహిస్తున్న సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లింది. తన ఫోన్‌ బాగు చేయమని సర్వీస్‌ సెంటర్‌లో ఫోన్‌ ఇచ్చి వచ్చింది. కొన్నాళ్లకు ఫోన్‌లోని నగ్న ఫొటోలు, వీడియోలు ఆమె ఫేసుబుక్‌లో కనిపించాయని ఆమె స్నేహితులు చెప్పారు. దీంతో ఆ విద్యార్థిని షాక్‌కు గురై వెంటనే తన ఫేస్‌బుక్‌లో నుంచి ఆ ఫొటోలు, వీడియోలను తొలగించారు. అనంతరం సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లి నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమ్మాయికి సంబంధించిన అంశం కావడంతో సంస్థ సున్నితంగా ఈ కేసును డీల్‌ చేసింది. అమ్మాయి పరువుకు సంబంధించిన విషయం కావడంతో వివరాలు బయటకు పొక్కకుండా చర్యలు చేపట్టింది. ఆమె ఫిర్యాదుతో విచారణ చేపట్టగా మరమ్మతులు చేసే ఇద్దరు టెక్నీషియన్లు ఆ ఫొటోలు, వీడియోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినట్లు తేలింది. దీంతో ఆ ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించారు. తమ తప్పిదం జరగడంతో ఐఫోన్‌ రహాస్య ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. సామరస్యంగా మాట్లాడుకుని 5 మిలియన్‌ డాలర్లు పరిహారంగా ఇచ్చేందుకు ఐఫోన్‌ ప్రతినిధులు అంగీకరించారు. ఈ విషయాలు రహాస్యంగా ఉంచారు. కానీ టెలిగ్రాఫ్‌ బహిర్గతం చేసింది. ‘వినియోగదారుడు మానసిక క్షోభ అనుభవించారు’ అని భావించి ఐఫోన్‌ అంత భారీ మొత్తంలో పరిహారం అందించినట్లు తెలుస్తోంది. సంస్థకు చెడ్డపేరు రాకుండా ఈ విధంగా రహాస్య ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. ఈ పరిహారం త్వరలోనే ఆమెకు అందించనున్నారు.

మరిన్ని వార్తలు