విషాదం నుంచి విహారం వైపు..

2 Oct, 2020 04:22 IST|Sakshi
బీజింగ్‌లో నేషనల్‌డే వేడుకల్లో చైనీయులు

కోవిడ్‌ నుంచి కోలుకోవడంతో చైనాలో ఊపందుకున్న పర్యాటకం

బీజింగ్‌: చైనా తన 71వ ప్రజా రిపబ్లిక్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఎనిమిది రోజుల అధికారిక సెలవు దినాలు ప్రకటించింది. జాతీయ సెలవుదినాలతో పాటు ఈ యేడాది శరద్‌రుతువులో వచ్చే పండుగ కలిసి రావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు కోవిడ్‌ సంక్షోభం తరువాత, విహార యాత్రలకు సిద్ధమౌతున్నారు. చైనాలో జాతీయ సెలవుదినాలు, ప్రయాణాలపై ఆంక్షలు సడలించడంతో భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాలకు ప్రజలు తరలివెళుతున్నట్టు టూర్‌ ఆపరేటర్లు తెలిపారు.

అంతర్జాతీయ ప్రయాణాలపై  ఆంక్షలు కొనసాగుతుం డడంతో, దేశీయ ప్రయాణాలకు, బంధువులను కలిసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని వారు తెలిపారు. దేశీయ విమాన ప్రయాణాలు 1.5 కోట్లకు చేరవచ్చునని, ఇది గత యేడాదితో పోల్చుకుంటే పది శాతం అధికమని హాంకాంగ్‌ కేంద్రంగా వెలువడే సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ తెలిపింది. టికెట్ల బుక్కింగ్‌ వెబ్‌సైట్‌ ‘‘కునార్‌’’ ప్రారంభించిన కొద్ది సేపటికే టిక్కెట్లన్నీ పూర్తిగా అయిపోయాయని ఆ పత్రిక తెలిపింది. హై స్పీడ్‌ రైళ్ళల్లో కూడా సీట్లన్నీ రిజర్వు అయిపోయాయని జిన్‌హువా వార్తా సంస్థ వెల్లడించింది. కోవిడ్‌ నుంచి కోలుకుంటోన్న చైనా ఆర్థిక సంక్షోభం నుంచి  బయటపడతామని ధీమా వ్యక్తం చేసింది.  
 

>
మరిన్ని వార్తలు