ఆ వీడియో లేకపోతే... నిజం తెలిసేది కాదు!!

29 Oct, 2020 09:20 IST|Sakshi

అమెరికా శ్వేతజాతి దురహంకారాన్ని బయటపెట్టిన యువతికి ప్రతిష్టాత్మక అవార్డు  

జార్జ్ ఫ్లాయిడ్ హత్యను వెలికితీసిన సాహసానికి కరేజియస్ అవార్డు

న్యూయార్క్: యావత్‌ ప్రపంచాన్ని కుదిపేసిన అమెరికా నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణాన్ని వెలుగులోకి తెచ్చిన యువతికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కనుంది. జార్జ్ ఫ్లాయిడ్ పై పోలీసుల జాత్యహంకార హత్య ఘటనను చిత్రీకరించిన డార్నెల్లా ఫ్రాజియర్(17) బెనెన్‌సన్ కరేజియస్ సాహసోపేత అవార్డుకు ఎంపికయ్యారు. డార్నెల్లా సాహసానికి,తెగువకుగాను ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్టు అమెరికాలోన ప్రముఖ సాహిత్య, మానవ హక్కుల సంస్థ పెన్ బుధవారం వెల్లడించింది. (అమెరికా ఆత్మను తట్టిలేపిన జార్జ్‌)

ధైర్యంతో, కేవలం ఒక ఫోన్ ద్వారా డార్నెల్లా అమెరికా చరిత్రనే మార్చేసిందని పెన్ అమెరికా సీఈఓ సుజాన్ నోసెల్ వెల్లడంచారు. ప్రాణాలకు  సైతం లెక్కచేయకుండా.. ఎంతో ధైర్యంగా ఆమె ఈ వీడియోను తీసి ఉండకపోతే.. జార్జ్ ఫ్లాయిడ్ హత్య గురించి ప్రపంచానికి ఎప్పటికీ నిజం తెలిసి ఉండేది కాదన్నారు. తద్వారా జాతివివక్ష, హింసను అంతం చేయాలని కోరుతూ సాహసోపేతమైన ఉద్యమానికి నాంది పలికారని ప్రశంసించారు. డిసెంబర్ 8న వర్చువల్ గాలా సందర్భంగా ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

ఈ ఏడాది మే 25న మిన్నెపొలిస్‌లో తెల్ల పోలీసు అధికారుల చేతిలో ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్  హత్యకు గురైన సంగతి తెలిసిందే. దాదాపు పది నిమిషాల పాటు మోకాళ్లతో  జార్జ్ ఫ్లాయిడ్ మెడను అదిమి పెట్టడంతో ఊపిరాడక అతడు మరణించాడు. అయితే, ఈ దుర్మార్గాన్ని డార్నెల్లా తన ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీంతో అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా శ్వేతజాతి దురహంకారంపై నిరసనలు వెల్లువెత్తాయి. ఐ కాంట్‌ బ్రీత్‌ అంటూ రోదించిన జార్జ్‌ఫ్లాయిడ్‌ చివరి మాటలే నినాదంగా అమెరికన్‌ యువత పోరు బాట పట్టింది. అలాగే 'బ్లాక్ లైవ్స్ మేటర్' అంటూ జాతి వివక్షపై ఉద్యమం రాజుకున్న సంగతి విదితిమే.

>
మరిన్ని వార్తలు