ప్రపంచ ఫ్యాషన్‌ షోలో కన్నీరు పెట్టిన సుందరి

1 Apr, 2021 14:41 IST|Sakshi

బ్యాంకాక్‌: ప్రపంచ దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్న ఫ్యాషన్‌ షో అది. హొయలు ఒలుకుతూ.. తమ అందచందాలను చూపుతూ ఆహూతులను ఆకట్టుకునేలా వయ్యారంగా నడుస్తున్నారు. వందలాది మంది పాల్గొన్న ఆ షోలో 20 మంది తుది పోటీకి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారితో నిర్వాహకులు మాట్లాడించారు. ఈ క్రమంలో ఓ సుందరి మాట్లాడుతూ.. తన దేశాన్ని తలుచుకునూ కన్నీటి పర్యంతమైంది. నా దేశాన్ని కాపాడండి’ అంటూ అంతర్జాతీయ వేదికపై రోదిస్తూ విజ్ఞప్తి చేసింది. ఈ రోజు నా సోదరులు 64 మంది మృతి చెందారని ఆవేదన చెందుతూ కన్నీరు పెట్టుకుంది. ఈ పరిణామం మయన్మార్‌లో నెలకొన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించింది.

బ్యాంకాక్‌ మిస్‌ గ్రాండ్‌ పోటీలు-2020 ఉత్సాహంగా జరుగుతున్నాయి. మయన్మార్‌కు చెందిన 22 ఏళ్ల హాన్‌ లే కూడా పాల్గొంది. తన అందం.. వస్త్రధారణ, నడక, చూపులతో అందరినీ దృష్టిని ఆకర్షించి టాప్‌ 20 మందిలో చోటు సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమె వేదికపై మాట్లాడుతూ.. తన దేశంలో జరుగుతున్న పరిణామాలను వివరించింది. ‘ఈ స్టేజీపై నిలబడి మాట్లాడడం సాధారణ రోజుల్లో గర్వపడేదాన్ని. కానీ నా దేశంలో అస్థిర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సమయంలో మీ ముందు మాట్లాడడం చాలా కష్టంగా ఉంది. వందలాది మంది అమాయక ప్రజలు చనిపోతున్నారు. 64 మంది మరణించారనే విషయం నన్ను దిగ్ర్భాంతికి గురి చేసింది. మా దేశానికి అత్యవసర సాయం, అంతర్జాతీయ జోక్యం అవసరం’ అని హాన్‌ లే గుర్తు చేసింది. ‘దయచేసి మయన్మార్‌కు సాయం చేయండి’ అంటూ విలపిస్తూ ఆ అందాల సుందరి విజ్ఞప్తి చేసింది. దీంతో ఒక్కసారిగా ఆ ఫ్యాషన్‌ షో వాతావరణం ఉద్విగ్నంగా మారింది. హాన్‌ లే మిస్‌ గ్రాండ్‌  మయన్మార్‌ అవార్డు సొంతం చేసుకుని ఈ పోటీలకు ఎంపికైంది.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు