Miss Universe: ఎవరీ ఆండ్రియా మెజా?

17 May, 2021 14:57 IST|Sakshi

వాషింగ్టన్‌: మెక్సికో భామ ఆండ్రియా మెజా మిస్‌ యూనివర్స్‌గా ఎంపికయ్యారు. ఫ్లోరిడాలో జరిగిన అందాల పోటీ ఫైనల్లో గెలుపొంది విశ్వ సుందరి కిరీటం సొంతం చేసుకున్నారు. తొలి రన్నరప్‌గా మిస్‌ బ్రెజిల్‌ జులియా గామా, రెండో రన్నరప్‌గా మిస్‌ పెరూ జానిక్‌ మెసెటా డెల్‌ కాసిలో నిలిచారు. మిస్‌ ఇండియా అడెలిన్‌ కాస్టెలినో సైతం గట్టిపోటీనిచ్చి టాప్‌-5లో స్థానం సంపాదించుకున్నారు. 

ఇక దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ మిస్‌ యూనివర్స్‌(2019) జోజిబినీ తుంజీ విజేత ఆండ్రియాకు కిరీటం అలంకరించారు. కాగా మొత్తం డెబ్బై మందికి పైగా పాల్గొన్న ఈ పోటీలో విజయం సాధించారని ప్రకటించగానే ఆండ్రియా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమవుతూనే క్యాట్‌వాక్‌ పూర్తి చేశారు.


ఎవరీ ఆండ్రియా?
మిస్‌ యూనివర్స్‌ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. 26 ఏళ్ల ఆండ్రియా మెజా.. మెక్సికోని చిహువాకు చెందినవారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. మోడలింగ్‌పై ఆసక్తి గల ఆమె.. చిహువా టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటూ తమ సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచానికి చాటిచెబుతున్నారు.

అంతేగాకుండా, మహిళా హక్కులపై ఉద్యమిస్తూ.. లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. ఇక సర్టిఫైడ్‌ మేకప్‌ ఆర్టిస్టు మోడల్‌ అయిన ఆండ్రియాకు క్రీడల అంటే కూడా ఆసక్తి. జంతు హింసను తట్టుకోలేని ఆమె.. వీగన్‌గా మారిపోయారు. పూర్తి శాకాహారమే తీసుకుంటున్నారు. కాగా మెక్సికో నుంచి మిస్‌ యూనివర్స్‌గా ఎంపికైన మూడో మహిళగా ఆండ్రియా నిలిచారు. అంతకు ముందు లుపితా జోన్స్‌(1991), షిమెనా నవరటె(2010) ఈ విశ్వ సుందరీమణులుగా నిలిచారు.


గొప్ప హృదయం ఉన్నవాళ్లే..
ఫైనల్‌లో భాగంగా.. అందానికి ప్రామాణికత ఏమిటి అన్న ప్రశ్నకు..‘‘అత్యంత నాగరికమైన సమాజంలో మనం ఉన్నాం. అదే సమయంలో కొన్ని కట్టుబాట్లను కూడా మనతో పాటు ముందుకు తీసుకువెళ్తున్నాం. అందం అనేది కేవలం బాహ్య రూపురేఖలకు సంబంధించింది కాదు. మన ఆత్మలో, గొప్ప మనసు కలిగి ఉండటంలోనే ఉంటుంది. మనం విలువ గల వ్యక్తులం కాదని ఎదుటివాళ్లు అవహేళన చేసేందుకు అస్సలు అనుమతించకూడదు’’ అని బదులిచ్చి ఆండ్రియా 69వ మిస్‌ యూనివర్స్‌గా నిలిచారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది విశ్వ సుందరి పోటీలు రద్దు అయిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు