Miss Universe: ఏంటీ ఆండ్రియాకు పెళ్లైందా?!

22 May, 2021 15:04 IST|Sakshi

పెళ్లి వార్తలపై మిస్‌ యూనివర్స్‌ వివరణ

మెక్సికో సిటీ: మిస్‌ యూనివర్స్‌-2020 విజేత, మిస్‌ మెక్సికో ఆండ్రియా మెజాకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమెకు ఇది వరకే పెళ్లి అయ్యిందని, భర్తతో కలిసి దిగిన ఫొటోలే ఇందుకు నిదర్శనమంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఆండ్రియా మెజా ఖండించారు. తనకు వివాహం కాలేదని స్పష్టం చేశారు. కాగా మెక్సికోని చిహువాకు చెందిన ఆండ్రియా... సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. మోడలింగ్‌పై ఆసక్తి గల ఆమె.. చిహువా టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. 

అప్పటి నుంచి తమ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచానికి చాటిచెప్పే కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం.. మెజా ఓ ఫొటోను షేర్‌ చేశారు. ఇందులో.. తెల్లటి వెడ్డింగ్‌ గౌనులో మెరిసిపోతున్న ఆమె.. సూటులో ఉన్న ఓ పురుషుడిని హత్తుకుని ఉన్నారు. ‘‘ఇందుకు 3-09-2019’’ అనే క్యాప్షన్‌తో పాటు ఉంగరం ఎమోజీని జతచేశారు.

ఇక ఆదివారం అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన అందాల పోటీల్లో మిస్‌ యూనివర్స్‌గా ఆండ్రియా మెజా కిరీటం దక్కించుకున్న క్రమంలో ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అయ్యింది. దీంతో.. కొంతమంది ఆమెకు పెళ్లైందని, నిర్వాహకులను మోసం చేసి పోటీ చేసిందని కొంతమంది కామెంట్లు చేశారు. ఈ విషయంపై స్పందించిన ఆండ్రియా మెజా... ఈ వ్యాఖ్యలను కొట్టిపడేశారు.

చిహువా టూరిజం డెవలప్‌మెంట్‌లో భాగంగా కాపర్‌ కెనన్‌ వద్ద చేసిన ఫొటోషూట్‌కు సంబంధించిన దృశ్యం అది అని వివరణ ఇచ్చారు. అంతేగాక ఆ ఫొటోలో ఉన్నది తన బెస్ట్‌ఫ్రెండ్‌ వాళ్ల తమ్ముడు అని, స్నేహితులను ఆటపట్టించేందుకు డేట్‌ వేసి, వెడ్డింగ్‌ రింగ్‌ ఎమోజీ పెట్టామని పేర్కొన్నారు. అయితే, ఈ ఫొటో విషయం ఇంత గందరగోళం సృష్టిస్తుందని ఊహించలేకపోయానని వాపోయారు. అయినా తను అసత్య ప్రచారాలకు భయపడేదానిని కాదని, కెరీర్‌పై దృష్టిసారిస్తానని చెప్పుకొచ్చారు.

అది అవాస్తవం
ఇక మిస్‌ యూనివర్స్‌ పోటీల అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఈ ఫొటో గురించి మాకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. కానీ మేం అన్ని పరిశీలించిన తర్వాతే పోటీకి అర్హురాలిగా పరిగణిస్తాం. మెజా వివాహిత అన్న ప్రచారం అవాస్తవం’’ అని స్పష్టం చేశారు. కాగా విశ్వ సుందరి పోటీల నియమం ప్రకారం... అందులో పాల్గొనే వారు అవివాహుతులై ఉండాలన్న సంగతి తెలిసిందే.

చదవండి: Miss Universe: ఎవరీ ఆండ్రియా మెజా?

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు