-

కీలక దశలో క్లినికల్‌ ట్రయల్స్‌

28 Jul, 2020 08:56 IST|Sakshi

వ్యాక్సిన్‌ రేసులో మొడెర్నా, ఫైజర్‌ దూకుడు

న్యూయార్క్‌ : కరోనా కట్టడికి ప్రపంచం ఆశగా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్‌ మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కీలక మానవ పరీక్షలు తుదిదశకు చేరిన క్రమంలో​ వ్యాక్సిన్‌ రాకపై స్పష్టత వస్తోంది. తమ వ్యాక్సిన్‌ పరీక్షలు విజయవంతమైతే అక్టోబర్‌ నాటికి రెగ్యులేటరీ అనుమతులు పొంది సంవత్సరాంతానికి 5 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని ఫైజర్‌ వెల్లడించింది. నవంబర్‌ నాటికే వ్యాక్సిన్‌ తయారీ, సరఫరాలు ప్రారంభమవుతాయనే సంకేతాలు పంపింది. 2021 సంవత్సరాంతానికి 130 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల సరఫరాకు ఫైజర్‌ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక 2021 నుంచి ఏడాదిలోగా 100 కోట్ల వరకూ వ్యాక్సిన్‌ డోసులను అందుబాటులోకి  తేవాలని మొడెర్నా కసరత్తు సాగిస్తోందని కంపెనీ సీఈఓ స్టెఫానే బాన్సెల్‌ తెలిపారు.

తాము అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ల భద్రత, సామర్థ్యం పరీక్షించేందుకు మొడెర్నా, ఫైజర్‌ కంపెనీలు 30,000 మందిపై కీలక మానవ పరీక్షలను ప్రారంభించాయి. వ్యాక్సిన్‌ పరీక్షలు విజయవంతమైతే రెగ్యులేటరీ అనుమతులు పొంది ఏడాది చివరికి పెద్దసంఖ్యలో వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువస్తామని ఈ రెండు సంస్థలు వెల్లడించాయి. అమెరికాను వణికిస్తున్న కోవిడ్‌-19ను సమర్ధంగా నిరోధించేందుకు సత్వరమే వ్యాక్సిన్‌ అభివృద్ధిని వేగవంతం చేయాలన్న ట్రంప్‌ యంత్రాంగం సూచనల మేరకు ఈ సంస్థలు తుది పరీక్షలకు సన్నాహాలు చేశాయి. ఇప్పటివరకూ ఎలాంటి వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన అనుభవం లేని మొడెర్నాకు కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం అమెరికా ప్రభుత్వం నుంచి దాదాపు రూ .7500 కోట్ల నిధులు లభించాయి. చదవండి : కోవిడ్‌ వ్యాక్సిన్‌ : ట్రంప్‌ ఆసక్తికరవ్యాఖ్యలు

తమ వ్యాక్సిన్‌ విజయవంతమైతే 5 కోట్ల మందికి రూ 15,000 కోట్లకు వ్యాక్సిన్లను విక్రయించేందుకు ఫైజర్‌ అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి వివిధ దశల్లో ఉండగా, దాదాపు 20 వ్యాక్సిన్లు మానవ పరీక్షల దశకు చేరుకున్నాయి. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సైతం ఈ వారంలో కరోనా వ్యాక్సిన్‌పై మానవ పరీక్షలను చేపట్టనుండగా, సెప్టెంబర్‌లో భారీ స్ధాయిలో తుది పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు