‘నవ’ పారిజాతాలు

6 May, 2022 03:23 IST|Sakshi
బర్త్‌డే రోజున తోబుట్టువులతో సౌదా 

ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఆరు.. ఏడు.. ఎనిమిది.. తొమ్మిది.. 

గంపెడు సంతానం అంటుంటారు.. మాలీకి చెందిన 27 ఏళ్ల హలీమా విషయానికొస్తే.. గంపెడు సంతానమంటే.. తొమ్మిది మంది!! ఎందుకంటే.. ఈ చిత్రంలో కనిపిస్తున్నవారందరూ ఆమె పిల్లలే(ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు).. పైగా.. వీరందరూ ఒకే కాన్పులో జన్మించారు!! ఒకరిద్దరికే ఆపసోపాలు పడుతున్న ఈ కాలంలో 9 మంది అంటే మాటలా.. గతేడాది మే 4న వీరు జన్మించారు.

ఇప్పటివరకూ చరిత్రలో ఒకే కాన్పులో 9 మంది పుట్టిన ఘటనలు మూడుసార్లు మాత్రమే జరిగాయి.. అయితే.. అలా పుట్టినవారందరూ బతికి ఉండటం మాత్రం ఇదే తొలిసారి.. మొన్న మే 4న వీరందరూ తమ మొదటి పుట్టిన రోజును మొరాకోలోని కాసబ్లాంకాలో జరుపుకున్నారు. కాన్పు కోసం హలీమాను మాలీ ప్రభుత్వం మొరాకోకు తరలించింది.

అప్పటి నుంచి ఆమె పిల్లలతో అక్కడే ఉంది. వీళ్లను చూసుకోవడానికి నర్సుల బృందాన్ని కూడా నియమించారు. ఈ ఖర్చులన్నీ మాలీ ప్రభుత్వమే భరిస్తోంది. ఈ నవ శిశువుల పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి వీరందరి అక్క సౌదా(మొత్తంగా 10 మంది పిల్లలు), హలీమా భర్త ఖాదర్‌ మాలీ నుంచి వచ్చారు. ఖాదర్‌ మాలీ సైన్యంలో పనిచేస్తున్నారు. ఇంతమంది పిల్లలు బతికిబట్టకట్టడం అంటే అంతా దేవుడి దయేనని ఈ సందర్భంగా ఖాదర్‌ అన్నారు.   

మరిన్ని వార్తలు