ఇద్దరూ కవలలే.. కానీ బర్త్‌డే ఎవరిది వారిదే.. అదేంటి!

8 Jun, 2022 12:35 IST|Sakshi

మామూలుగా కవలలు అంటే తల్లి కడుపులో కలిసి పెరిగి, కలిసి పుట్టేవారే. అలాంటివారు కొద్ది నిమిషాల తేడాలో జన్మిస్తుంటారు. అరుదుగా గంటా రెండు గంటలు కూడా తేడా ఉంటుంది. ఒకే పోలికలతో పుట్టేవారి (ఏకరూప కవలల) మధ్య అయితే మాత్రం తేడా నిమిషాల్లో మాత్రమే ఉంటుంది. కానీ అమెరికాలోని అబిలీన్‌లో కార్మెన్‌ మార్టినెక్స్‌ అనే మహిళకు తొలి పాప పుట్టిన తర్వాత మూడు రోజులకు రెండో పాప జన్మించింది. నిజానికి మార్చి తొలివారంలో ఆమెకు పురుటి నొప్పులు వచ్చాయి. ఆస్పత్రికి తీసుకెళితే మార్చి 7న ఒక పాపకు జన్మనిచ్చింది.

రెండో పాప గర్భంలో అలాగే ఉండిపోయింది. ఆ శిశువు ఆరోగ్యంగానే ఉండటంతో వైద్యులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. మూడు రోజుల తర్వాత మార్చి 10న మార్టినెక్స్‌ రెండో పాపకు జన్మనిచ్చింది. మొదటి పాపకు గాబ్రియేలా గ్రేస్‌ అని, రెండో పాపకు ఇసబెల్లా రోస్‌ అని పేరుపెట్టారు. ‘‘ఇద్దరికీ ఒకే రోజు ఏంటి? నా స్పెషల్‌డే పార్టీ నాకు ఉండాల్సిందే అనుకుంటూ ఇసబెల్లా లేటుగా పుట్టేసింది. ఏమైనా నా పిల్లలు సమ్‌థింగ్‌ స్పెషల్‌’’ అంటూ మార్టినెక్స్‌ మురిసిపోతోంది. 

అత్యంత అరుదుగా.. 
ఇద్దరూ పూర్తిగా ఎదగకముందే కేవలం 24–25 వారాల్లోనే, కేవలం 700 గ్రాముల బరువుతోనే పుట్టడంతో.. మూడు నెలలుగా పిల్లల ఐసీయూ (ఎన్‌ఐసీ యూ)లో ఉంచారు. అసలు బతుకుతారో లేదో అనే పరిస్థితి నుంచి ఇక ప్రమాదం లేనట్టేననే దశకు చేరాక.. వైద్యులు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఇలా కవలలు మూడు రోజుల తేడాతో జన్మించడం అత్యంత అరుదైన విషయమని ప్రకటించారు.  
చదవండి: బార్‌లో బాయ్‌ఫ్రెండ్‌ నిర్వాకం.. కారుతో తొక్కి చంపేసిన ప్రియురాలు

మరిన్ని వార్తలు