38 ఏళ్లోచ్చినా గర్ల్‌ఫ్రెండ్‌ లేదు.. నా కుమారుడిలో ఏదో లోపం ఉంది.. ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లికి షాక్..!

9 Feb, 2023 15:42 IST|Sakshi

బీజింగ్‌: పిల్లలకు పెళ్లీడు వచ్చిందంటే చాలు తల్లిదండ్రులు హడావిడి చేస్తుంటారు. సంబంధాలు చూసి త్వరగా పెళ్లి చేసేయాలని అనుకుంటారు. ఈ కాలంలో యువత అయితే తల్లిదండ్రులకు పని లేకుండా వారే తమ జీవిత భాగస్వాములను చూసుకుంటున్నారు.  

అలాంటిది 38 ఏళ్లొచ్చినా తన కొడుకు ఇంకా సింగిల్ గానే ఉంటున్నాడని, ఇప్పటివరకు ఒక్క గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా ఇంటికి తీసుకురాలేదని ఓ తల్లి ఆందోళన చెందుతోంది. అంతేకాదు ఇన్నేళ్లు వచ్చినా పెళ్లి మాట ఎత్తకపోవడంతో అతని తలలో ఏదో లోపం ఉన్నట్టుందని ఆమెకు అనుమానం వచ్చింది.  దీంతో కుమారుడ్ని ప్రతి ఏటా మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తోంది.

ఈ ఘటన చైనా హెనాన్ రాష్ట్రంలో జరిగింది. 38 ఏళ్లొచ్చినా సింగిల్‌గా ఉంటున్న ఇతని పేరు వాంగ్. ఇతనికి పెళ్లి కావడంలేదని తల్లి దిగులు చెందుతోంది. కుమారుడ్ని మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తే సమస్య తీరుతుందని భావించింది. దీంతో 2020 నుంచి ప్రతి ఏటా చైనా లూనార్ న్యూ ఇయర్ తర్వాత వాంగ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తోంది.

ఈసారి షాక్..
అయితే ఈసారి ఫిబ్రవరి 4న ఆస్పత్రికి వెళ్లిన వాంగ్ తల్లికి వైద్యులు షాక్ ఇచ్చారు. అతను బాగానే ఉన్నాడని ఏలాంటి సమస్యా లేదని స్పష్టం చేశారు. అసలు సమస్య ఆమెలోనే ఉందని, కుమారుడికి పెళ్లి కావడం లేదనే దిగులుతో 'మెంటల్ డిజార్డర్' వచ్చిందని చెప్పారు. దీంతో ఆమె అవాక్కయ్యింది.

తల్లి కోసమే..
కేవలం తల్లిని బాధపెట్టొద్దనే ఉద్దేశంతోనే తాను ఆస్పత్రికి వెళ్తున్నట్లు వాంగ్ చెప్పాడు. 10 ఏళ్లుగా తాను ఉద్యోగం చేస్తూ తీరక లేకుండా ఉన్నానని, గర్ల్‌ఫ్రెండ్‌ గురించి ఆలోచనే తనకు రాలేదన్నాడు. సమయం వచ్చినప్పుడు సరైన వ్యక్తి తన జీవితంలోకి వస్తుందేమేనని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అయినా ఇళ్లు కొనేందుకు డౌన్‌పేమెంట్‌కు డబ్బులు కూడా లేని తనను ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందని ప్రశ్నించాడు. తాను సిటీలో 'సూపర్ ఓల్డ్‌ సింగిల్ మ్యాన్' అంటూ ముసిముసి నవ్వులు నవ్వాడు.

చైనా మీడియాలో వాంగ్ కథనం ప్రసారం కాగా.. యువకులు పెద్ద చర్చకు తెరలేపారు. పెళ్లి చేసుకోకపోతే ఈ సమాజం తాము ఏదో పాపం చేసినట్లుగా చూస్తోందని, ఇది సబబేనా అని ఓ నెటిజన్ స్పందించాడు. మరో యువకుడు స్పందిస్తూ అసలు పెళ్లి చేసుకున్న వాళ్లే మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అసహనం వ్యక్తం చేశాడు.
చదవండి: అందంగా కన్పించాలని ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ.. ఆ తర్వాత గంటల్లోనే..

మరిన్ని వార్తలు