Monkeypox: 70 వేలు దాటిన మం‍కీపాక్స్ కేసులు.. ఇదే డేంజర్ టైమ్‌!

13 Oct, 2022 17:05 IST|Sakshi

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు 70వేల మార్కును దాటాయి. కొత్త కేసులు తగ్గుతున్నప్పటికీ నిర్లక్ష‍్యంగా ఉండొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది. ఇప్పటివరకు అన్ని దేశాల్లో కలిపి మంకీపాక్స్ బాధితుల సంఖ్య 70వేలు దాటిందని, మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి ఆరోగ్య సంస్థకు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ నివేదిక సమర్పించారు.

అయితే మంకీపాక్స్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇదే అత్యంత ప్రమాదకరమైన దశ అని టెడ్రోస్ హెచ్చరించారు. అమెరికా సహా 21 దేశాల్లో గతవారం కొత్త కేసులు పెరిగినట్లు పేర్కొన్నారు. ఇందులో అమెరికాలోనే 90శాతం కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కేసులు తగ్గాయని అజాగ్రత్తగా ఉంటే మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందని స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం మంకీపాక్స్ కేసుల్లో అమెరికాలోనే అత్యధికంగా 42వేల కేసులు వెలుగుచూశాయి. యూరప్ దేశాల్లో 25వేల మందికి ఈ వైరస్ సోకింది. భారత్‌లో ఇప్పటివరకు 14మంది మంకీపాక్స్ బారినపడ్డారు.
చదవండి: ఏడుపుగొట్టు సీఈఓ.. బామ్మ చావును కూడా కంపెనీ ప్రమోషన్‌కే!

మరిన్ని వార్తలు