సెకనుకో భూమిని మింగేస్తోంది!

21 Jun, 2022 02:49 IST|Sakshi

అంతరిక్షంలో కృష్ణబిలాలు (బ్లాక్‌ హోల్స్‌) ఉండటం కామనే. కాంతి సహా ఏదైనా సరే తన సమీపంలోకి వస్తే లాగేసుకునే కృష్ణ బిలాలు.. ప్రతి నక్షత్ర సమూహం (గెలాక్సీ)లో ఉంటాయి. కానీ ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఓ అతిపెద్ద ‘రాక్షస’కృష్ణబిలాన్ని గుర్తించి ‘జే1144’అని పేరు పెట్టారు. ఇప్పటివరకు గుర్తించిన అన్ని కృష్ణ బిలాల్లో.. అతిపెద్దది, కాంతివంతమైనది, వేగంగా ఎదుగుతున్నది ఇదేనని తెలిపారు.  

‘జే1144’మన సూర్యుడి కంటే 300 కోట్ల రెట్లు పెద్దగా ఉందని.. ప్రతి సెకన్‌కు మన భూమి అంత పరిమాణంలో ద్రవ్యరాశిని మింగేస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 
సుమారు తొమ్మిది వందల కోట్ల ఏళ్ల వయసున్న ‘జే 1144’.. మన పాలపుంత (మిల్కీవే) మధ్యలో ఉన్న కృష్ణబిలం ‘సాగిట్టారియస్‌ ఏ’కన్నా ఐదు వందల రెట్లు పెద్దదని తెలిపారు. 
పాలపుంతకు దక్షిణంగా 18 డిగ్రీల కోణంలో.. 700 కోట్ల కాంతి సంవత్సరాల దూరం లో ఈ కృష్ణబిలం ఉందని వెల్లడించారు. 
అసలు పాలపుంతలోని కొన్ని కోట్ల నక్షత్రాలన్నీ వెలువరించే కాంతికన్నా.. ఈ భారీ కృష్ణబిలం చుట్టూ ఉన్న ప్లాస్మా రింగ్‌ నుంచి వెలువడుతున్న కాంతి ఏడు వేల రెట్లు ఎక్కువని పేర్కొన్నారు. 
ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన ‘స్కైమ్యాపర్‌ సదరన్‌ స్కై సర్వే’.. విశ్వంలో దక్షిణ భాగంలో నక్షత్రాలు, గెలాక్సీలు, కృష్ణబిలాలు, ఇతర అంతరిక్ష వస్తువులను గుర్తించి మ్యాప్‌ రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు భారీ కృష్ణ బిలాన్ని కనుగొని, ఫొటో తీశారు. 

చిన్న గ్రహాలెన్నింటినో మింగేసి.. 
సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం బృహస్పతి (జూపిటర్‌). అది ఎంత పెద్దదంటే.. భూమి వంటి 1,300 గ్రహాలు అందులో సులువుగా ఫిట్టయిపోతాయి. ఇంకా చెప్పాలంటే సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలను కలిపినా జూపిటర్‌లో సగం కూడా నిండవు. మరి జూపిటర్‌ ఇంత పెద్దగా ఎలా ఉందన్న దానిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. అది చిన్నచిన్న గ్రహాలెన్నింటినో స్వాహా చేసినట్టు తాజాగా గుర్తించారు.

నాసాకు చెందిన జునో స్పేస్‌ ప్రోబ్‌ సాయంతో సేకరించిన డేటా ఆధారంగా ఈ అంచనాలు వేశారు. జూపిటర్‌ నిజానికి ఓ భారీ వాయుగోళం (గ్యాస్‌ జియాంట్‌). కేవలం పదిశాతమే కోర్‌ (గట్టిగా ఉండే మధ్యభాగం) ఉండి.. ఆపై మొత్తంగా హైడ్రోజన్, హీలియం, ఇతర వాయువులతో నిండి ఉందని ఇన్నాళ్లూ భావించారు. అయితే తాజా డేటా ప్రకారం.. జూపిటర్‌ పరిమాణంలో 30 శాతం వరకు కోర్‌ ఉన్నట్టు గుర్తించారు. 

‘‘సాధారణంగా వాయుగోళాల్లో కోర్‌ పెద్దగా ఉండదు. దీనితో జూపిటర్‌ వాతావరణంలోని వాయువులు, ధూళి మేఘాల రసాయన సమ్మేళనాలను పరిశీలించగా.. భారీ మూలకాలు ఉన్నట్టు తేలింది. సాధారణంగా భూమి, అంగారకుడు వంటి మట్టి, రాళ్లు ఉండే గ్రహాల్లోనే భారీ మూలకాలు ఉంటాయి. అంటే సౌర కుటుంబం ఏర్పడిన మొదట్లో చిన్న చిన్న గ్రహాలు, గ్రహ శకలాలను జూపిటర్‌ మింగేసి ఉంటుంది..’’అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన నెదర్లాండ్స్‌ లీడెన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త యమిలా మిగ్వేల్‌ తెలిపారు.  
– సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు