ఈ రాజభవనం అద్దె ఎంతంటే......

17 Oct, 2020 20:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని ‘మాంటెసిటో మాన్షన్‌’ను గంటల ప్రాతిపదికన అద్దెకిస్తున్నట్లు రెంటల్‌ వెబ్‌సైట్‌ గిగ్‌స్టార్‌లో ఓ ప్రకటన వెలువడింది. 5.4 ఎకరాల విస్తీర్ణంలో 14,563 చదరపు అడుగుల్లో ఇటాలియన్‌ శైలిలో నిర్మించిన ఈ భవనాన్ని ‘ది చేత్యూ’ అని కూడా పిలుస్తారు. పాటలు, వీడియోలు, సినిమా షూటింగ్‌లతోపాటు మ్యూజియం కోసం దీన్ని అద్దెకు ఇస్తారని, గంటకు ఏడు వందల డాలర్లు (దాదాపు 51,500 రూపాయలు) చొప్పున కనీసం పది గంటలకు ఇస్తారు.

లాస్‌ ఏంజెలిస్‌ నగరానికి దాదాపు రెండు గంటల ప్రయాణ దూరంలో కలిగిన ఈ భవనం ఆవరణలో ఈత కొలను, టెన్నీస్‌ కోర్టు, టీ హౌజ్, చిల్డ్రన్‌ కాటేజీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ భవనంలోనే ఓ గది నిండా వైన్‌ బాటిళ్లు ఉన్నప్పటికీ, వాటిని ఎవరూ తాకరాదు. బయటి నుంచి తీసుకొచ్చిన మద్యాన్ని కూడా ఈ భవనం లోపల తాగరాదు. చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడరాదు. ఎడల్ట్‌ వీడియో షూటింగ్‌లను కూడా అనుమతించరు. 

ఇంతకు ఈ భవనం యజమానులు ఎవరంటే బ్రిటీష్‌ యువరాజు ప్రిన్స్‌ హారీ, మేఘన్‌ మార్కెల్‌ దంపతులు. 2003లో నిర్మించిన భవనాన్ని అమెరికా వచ్చినప్పుడు ఉండేందుకు హారీ దంపతులు 14,7 మిలియన్‌ డాలర్లు (దాదాపు 108 కోట్ల రూపాయలు) వెచ్చించి కొనుగోలు చేశారట.

మరిన్ని వార్తలు