ఇంత వయసొచ్చినా ఇంకా ఇళ్లలోనేనా? శెభాష్‌ స్పెయిన్‌.. ఒక దెబ్బకి రెండు పిట్టలు

8 Oct, 2021 09:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తల్లిదండ్రులకు పిల్లలు భారమా?..  ఓ వయసుకి వచ్చేసరికి పిల్లలు తమ కాళ్ల మీద తాము బతకాలని ప్రతీ తల్లీతండ్రి కొరుకుంటారు. కానీ, ఆ వయసు దాటిన తర్వాత కూడా గడపదాటకుండా ఇంకా తల్లిదండ్రుల మీదే ఆధారపడి బతుకుతుంటారు కొందరు.  కారణాలు ఏవైనా.. ఈ కల్చర్‌ను తగ్గించేందుకు నాలుగున్నర కోట్లకు పైగా జనాభా ఉన్న స్పెయిన్‌ ఓ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. 


తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా.. దూరంగా బతికే పిల్లలకు నెలకు 250 పౌండ్లు ప్రభుత్వమే చెల్లించనున్నట్లు ప్రకటించింది. స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాన్‌షెజ్‌(49) స్వయంగా జాతిని ఉద్దేశించి మంగళవారం ఈ ప్రకటన చేశారు. 18 నుంచి 35 ఏళ్ల వయసులోపు పిల్లలు..  పేరెంట్స్‌కు దూరంగా, విడిగా ఉంటే నెలకు 250 పౌండ్లు(290 డాలర్లు.. మన కరెన్సీలో 21 వేల రూపాయలకు పైనే) ఇస్తామని ప్రకటించారాయన. అయితే ఇందుకు కొన్ని కండిషన్‌ కూడా పెట్టారు. 

కేవలం దూరంగా ఉండడం మాత్రమే కాదు.. ఏదైనా పని చేసుకుంటూ ఉంటేనే ఈ అమౌంట్‌ ఇస్తారట. అందులో ఏడాదికి 23 వేల పౌండ్లు సంపాదిస్తేనే.. ఈ బంపరాఫర్‌ వర్తిస్తుందని ప్రకటించారాయన. పైగా ప్రభుత్వం ఇచ్చే ఆ 250 పౌండ్లను అద్దె కోసమే ఖర్చు చేయాలని, అదీ రెండేళ్లపాటు ఇవ్వనున్నట్లు స్పెయిన్‌ ప్రభుత్వం ప్రకటించింది. 

స్పెయిన్‌లో గత కొన్నేళ్లుగా నిరక్షరాస్యత, నిరుద్యోగం రేటు పెరిగిపోతోంది. ఉద్యోగాలు లేక బద్ధకంగా మారిపోతోంది యువత. దీంతో 30 పడిలో పడ్డా కూడా ఇంకా తల్లిదండ్రుల మీదే ఆధారపడి బతుకుతున్నారు. విశేషం ఏంటంటే..  సంపాదించే స్తోమత ఉన్నవాళ్లు సైతం అద్దెను తప్పించుకునేందుకు తమ భార్యాపిల్లలతో తల్లిదండ్రుల ఇళ్లలోకి చేరిపోతున్నారు. 

మరోవైపు కరోనా ప్రభావంతో చాలా మంది ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. ఉద్యోగాలు చేసేవాళ్లు సైతం అద్దెను మిగిల్చుకునేందుకు ఇలా తల్లిదండ్రుల పంచన చేరుతున్నారు. సొంత ఇళ్ల కొనుగోళ్ల సంగతి సరేసరి. ఈ కారణాలతో ‘ఇళ్ల మార్కెట్‌’ సైతం దారుణంగా పడిపోయింది. ఈ పరిస్థితి ఒక్క స్పెయిన్‌లోనేకాదు.. ఇటలీ, గ్రీస్‌ ఇలా దాదాపు ఈయూ దేశాల్లో ఇలాంటి సినారియోనే కనిపిస్తోంది.  అందుకే స్పెయిన్‌ ప్రధాని పెడ్రో ‘హౌజింగ్‌ ప్లాన్‌’ రూపొందించి.. ఇలా ఆఫర్ల ద్వారా ఆకట్టుకుని హౌజ్‌ మార్కెటింగ్‌ ఆదాయం పెంచుకునేందుకు, యువతకు పట్టిన బద్ధకాన్ని వదిలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

చదవండి: పోర్న్‌ వీడియోలు.. న్యాయం చేయమంటే ఇలాంటి తీర్పు ఇచ్చారేంటి?

మరిన్ని వార్తలు