చందమామకు తోక ఉంది తెలుసా?

7 Mar, 2021 11:45 IST|Sakshi

తోకచుక్కలు మనందరికీ తెలుసు. సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండే తోకచుక్కలు.. సూర్యుడి దగ్గరికి వచ్చే కొద్దీ తోక పెరు గుతూ ఉండటం తెలిసిందే. కానీ, మనం రోజూ చూసే చందమామకు కూడా తోక ఉంది తెలుసా? చిత్రంగా అనిపిస్తున్నా ఇది నిజమే.. చంద్రుడికి కూడా తోక ఉందని, భూమిచుట్టూ తిరుగుతున్న సమయంలో సూర్యుడివైపు వెళ్లినప్పుడల్లా ఆ తోక ఏర్పడుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

బోస్టన్‌ వర్సిటీ విడుదల చేసిన చిత్రం 

సాధారణంగా తోకచుక్కలపై ఉండే మంచు, చిన్న చిన్న రాళ్లు, దుమ్ము, వంటివి సౌర వికిరణాలకు చెదిరిపోయి వెనుక తోకగా ఏర్పడుతాయి. వాటిపై సూర్య కాంతి పడి పరావర్తనం చెందడంతో పొడుగ్గా తోకలాగా మనకు కనిపిస్తాయి. కానీ చంద్రుడికి ఏర్పడుతున్న తోక మాత్రం అలాంటి దుమ్ము, మంచుతో కాకుండా.. సోడియం అణువులతో తయారవుతోందని ఈ అంశంపై పరిశోధన చేస్తున్న బోస్టన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త జెఫరీ తెలిపారు.

అందుకే అది మన సాధారణ కంటికి కనిపించడం లేదని.. ప్రత్యేక కెమెరాలు, టెలిస్కోపులతో చూడవచ్చని చెప్పారు. చంద్రుడిపై వాతావరణం లేకపోవడం వల్ల.. సౌర కాంతి రేడియేషన్‌ నేరుగా ఎఫెక్ట్‌ చూపిస్తుందని, దానికితోడు నిత్యం ఢీకొట్టే ఉల్కతో చంద్రుడి ఉపరితలంపై సోడియం అణువులు పైకి ఎగుస్తున్నాయని వివరించారు. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ తోక చిన్న చిన్నగా ఏమీ లేదట. ఏకంగా ఐదారు లక్షల కిలోమీటర్ల పొడవునా ఏర్పడుతోందని గుర్తించారు. సూర్యుడికి, భూమికి మధ్య ప్రాంతంలోకి చంద్రుడు వచి్చనప్పుడు.. ఈ తోకలోని సోడియం అణువులు భూమివైపు కూడా వస్తాయని, కానీ మన వాతావరణం వాటిని అడ్డుకుంటోందని తేల్చారు.

మరిన్ని వార్తలు