మయన్మార్‌లో నిరసనకారులపై తూటా

28 Mar, 2021 04:28 IST|Sakshi
యాంగాన్‌ పట్టణంలో నిరసనప్రాంతం వద్ద ఆందోళనకారులు

సైన్యం కాల్పుల్లో 93 మందికిపైగా బలి

అంతర్జాతీయంగా వెల్లువెత్తిన నిరసన

యాంగాన్‌: మయన్మార్‌లో మిలటరీ ఒకవైపు సాయుధ బలగాల దినోత్సవాన్ని జరుపుకుంటూనే నిరసనకారులపై తన క్రూరత్వాన్ని ప్రదర్శించింది. మిలటరీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న వారిపై తుపాకీగుళ్ల వర్షం కురిపించింది. ఈ కాల్పుల్లో  శనివారం మధ్యాహ్నానికి  93 మందిపైగా  మిలటరీ తూటాలకు బలైనట్టుగా మయన్మార్‌లో స్వతంత్ర అధ్యయన సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరి 1న మయన్మార్‌లో ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న మిలటరీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది.

ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి సైనికులు యాంగాన్, మాండాలే సహా  12 పట్టణాల్లో నిరసనకారులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. మండాలేలో జరిగిన కాల్పుల్లో అయిదేళ్ల బాలుడు మరణించడంతో విషాదం నెలకొంది. మయన్మార్‌ సైనికులు తమని అణగదొక్కాలని చూస్తున్నప్పటికీ వారు గద్దె దిగేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని నిరసనకారులు ఎలుగెత్తి చాటారు. ‘‘మమ్మల్ని పిట్టల్లా కాల్చేస్తున్నారు. మా ఇళ్లల్లోకి కూడా సైనికులు చొరబడుతున్నారు’’ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిలటరీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు మొత్తంగా  400 మంది అమాయకులు బలయ్యారు.

సిగ్గుతో తలదించుకోవాలి
ఒకే రోజు ఈ స్థాయిలో అమాయకులు బలైపోవడంతో అంతర్జాతీయంగా మయన్మార్‌ మిలటరీపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘సాయుధ బలగాలు ఇవాళ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు’’ అని మిలటరీకి వ్యతిరేకంగా అధికారాన్ని కోల్పోయిన ప్రజాప్రతినిధుల కూటమి అధికార ప్రతినిధి డాక్టర్‌ శస అన్నారు. సాయుధబలగాల దినోత్సవం బీభత్సంగా జరిగింది. ఇలాంటి చర్యలు ఎంత మాత్రం సమర్థనీయం కాదు అని మయన్మార్‌లో యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధుల బృందం విమర్శించింది.  మరోవైపు మిలటరీ చీఫ్‌ సీనియర్‌ జనరల్‌ మిన్‌ ఆంగ్‌ హాలింగ్‌ ప్రజల పరిరక్షణ కోసమే తామున్నామని అన్నారు. త్వరలోనే స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు