Russia-Ukraine War: మాస్కో కౌన్సిలర్‌పై పుతిన్‌ ఫైర్‌.. అందుకు ఏడేళ్ల జైలు శిక్ష!

9 Jul, 2022 14:09 IST|Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం గత నెలుగు నెలలకుపైగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి రష్యా సేనలు. యుద్ధం ముగించాలని ప్రపంచ నేతలు సూచిస్తున్నా, కఠిన ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గటం లేదు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. తమ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌ దాడిని ఖండించిన మాస్కో కౌన్సిలర్‌ అలెక్సీ గోరినోవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఖండిస్తూ మాట్లాడటమే ఆయన చేసిన తప్పు.

క్రాస్నోసెల్స్కీ మున్సిపల్‌ కౌన్సిల్‌కు చెందిన 60 ఏళ్ల గోరినోవ్‌.. సిటీ కౌన్సిల్‌ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ప్రశించారు. ఉక్రెయిన్‌లో వందల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ.. బాలల దినోత్సవంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను తప్పుపట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో చినిపోయిన వారికి సంతాపం తెలుపుతూ కొద్ది సేపు మౌనం పాటించారు. దీంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయనపై అభియోగాలు మోపారు. రష్యా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనే కారణంగా కేసు నమోదైనట్లు తీర్పు చెబుతున్న సందర్భంలో న్యాయమూర్తి ఒలెస్యా మెండెలెయెవ తెలిపారు.

ఉక్రెయిన్‌పై సైనిక చర్య తర్వాత అసమ్మతి వాదులను ఎదుర్కొనేందుకు తీసుకొచ్చిన కొత్త చట్టాల ప్రకారం ఓ వ్యక్తికి జైలు శిక్ష విధించటం ఇదే మొదటి. ఈ కొత్త చట్టాల ప్రకారం.. ప్రభుత్వానికి, ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్యకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారికి గరిష్ఠంగా 15 ఏళ్ల జైలు శిక్ష విధించేందుకు వీలు కల్పించారు. సైనిక చర్య ద్వారా తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రజల్లో ఆందోళన నెలకొనేలా గోరినోవ్‌ మాట్లాడారని తీర్పు సందర్భంగా జడ్జి తెలిపారు. విచారణకు హాజరైన సందర్భంగా ఓ చిన్న కాగితంపై 'ఇప్పటికీ ఈ యుద్ధం మీకు అవసరమా?' అంటూ ప్రశ్నించే ప్రయత్నం చేశారు గోరినోవ్‌. దానిని కెమెరాకు కనిపించకుండా చేసేందుకు ‍అక్కడి భద్రతా సిబ్బంది ప్రయత్నించారు.

చదవండి:  Russia-Ukraine War: అసలు యుద్ధం ముందే ఉంది

>
మరిన్ని వార్తలు