ఒంటివాసనే దోమకాటుకు మూలం

20 Oct, 2022 02:54 IST|Sakshi

న్యూయార్క్‌:  దోమలు. మనందరికీ ఉమ్మడి శత్రువులు. మలేరియా, జైకా, డెంగీ ప్రాణాంతక జ్వరాలకు కారణం. ఇవి కొందరినే ఎక్కువగా కుట్టడానికి కారణం ఏమిటి? ఫలానా రక్తం గ్రూప్‌ ఉన్నవారిని, రక్తంలో చక్కెర స్థాయిలు బాగా ఉన్నవారిని, వెల్లుల్లి, అరటిపండ్లు ఎక్కువగా తినేవారిని, మహిళలను దోమలు అధికంగా కుడుతుంటాయని అనుకుంటుంటారు.

కానీ, ఇవేవీ నిజం కాదని అమెరికాలోని రాక్‌ఫెల్లర్‌ వర్సిటీ పరిశోధకులు తేల్చిచెప్పారు. శరీరం నుంచి వెలువడే ఓ రకం వాసనే దోమలను ఆయస్కాంతంలా ఆకర్షిస్తుందని, అలాంటి వారినే అవి ఎక్కువగా కుడుతుంటాయని తేల్చారు. ఈ వాసనకు కారణం శరీరంలోని కొవ్వు అమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్‌). ఇవి దోమలను ఆకర్షించే వాసనను ఈ ఉత్పత్తి చేస్తాయట! అధ్యయనం వివరాలను ‘జర్నల్‌ సెల్‌’లో ప్రచురించారు.  

మస్కిటో మ్యాగ్నెట్‌ మారదు  
చర్మంలో కార్బోజైలిక్‌ యాసిడ్స్‌ స్థాయిలు అధికంగా ఉన్నవారి పట్ల దోమలు విపరీతంగా ఆకర్షణకు గురవుతాయని అమెరికాలోని ‘రాక్‌ఫెల్లర్స్‌ ల్యాబొరేటరీ ఆఫ్‌ న్యూరోలింగ్విస్ట్‌ అండ్‌ బిహేవియర్‌’ ప్రతినిధి లెస్లీ వూషెల్‌ చెప్పారు. చర్మంలో భారీగా ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటే దోమల ముప్పు అధికమేనని వివరించారు. జైకా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికున్‌గున్యా వంటి  జ్వరాలకు కారణమయ్యే ‘ఎడిస్‌ ఈజిప్టి’ దోమలపై మూడేళ్లు అధ్యయనం చేశారు. చర్మంలో ఫ్యాటీ యాసిడ్స్‌ స్థాయిలు బాగా ఉన్నవారే ఎక్కువగా దోమకాటుకు గురవుతున్నట్లు గుర్తించారు. ఆ అమ్లాల నుంచి ఉత్పత్తయ్యే గ్రీజులాంటి కార్బోజైలిక్‌ యాసిడ్స్‌ చర్మంపై కలిసి పొరలాగా పేరుకుంటాయి. వాటి నుంచి వచ్చే ఒక రకమైన వాసన దోమలను ఆకట్టుకుంటుందట!.

మరిన్ని వార్తలు