కొడుకును తప్పించేందుకు సొరంగ మార్గం!

4 Aug, 2020 19:25 IST|Sakshi

న్యూఢిల్లీ : కొడుకు రాజైనా, పేదయినా, చివరకు నేరస్థుడైనా అతనిపై తల్లికి ప్రేముంటుందని అంటారు. ఈ నిజాన్ని మరోసారి నిర్ధారించింది ఉక్రెయిన్‌లోని దక్షిణ జపోరిజియా ప్రాంతంలో నివసిస్తున్న ఓ తల్లి ఉదంతం. హత్య కేసులో నేరం రుజువై యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కొడుకును జైలు నుంచి తప్పించేందుకు ఆ తల్లి అనూహ్య నిర్ణయం తీసుకుంది. జైలు పక్కన పది అడుగుల లోతులో ఏకంగా 35 అడుగుల పొడవైన సొరంగాన్ని ఒంటరిగా తవ్వింది. అది కూడా  సాధారణ చేతి పరికరాలు, పనిముట్లను ఉపయోగించి ఆ పని చేసింది. ఆ తల్లి ముందస్తు వ్యూహంతో జైలుకు సమీపంలోని ఇంటిని అద్దెకు తీసుకుంది.

జైలుకు సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో సొరంగం తవ్వకానికి స్థలాన్ని ఎంపిక చేసుకుంది. పగలు చేస్తే జనం దష్టిలో పడతాననే ఉద్దేశంతో ఆమె కేవలం రాత్రి పూటే మూడు వారాల పాటు కష్టపడి పది అడుగుల లోతు నుంచి జైలు ప్రహారీ గోడల లోపలి వరకు సొరంగ మార్గాన్ని తవ్వింది. అలా తవ్వడం ద్వారా వచ్చిన దాదాపు మూడు టన్నుల మట్టిని సమీపంలో ఉన్న నిరుపయోగ చెత్తకుండిలో పారవేసింది. ఆమె వద్ద రెండు చక్రాలు కలిగిన చెత్తను మోసుకుపోయే ఇనుప లాగుడు బండి ఉందని, దానిలో తట్టా, పార వేసుకొని జైలుకు సమీపంలో అప్పుడప్పుడు కనిపించిందని జైలు సెక్యూరిటీ గార్డు తెలిపారు.

మూడు వారాల అనంతరం ఆమె సొరంగ మార్గాన్ని తవ్వుతూ జైలు సెక్యూరిటీ గార్డులకే పట్టుబడింది. అంతకుముందు ఐదు కిలోమీటర్ల దూరంలోని మైకలోవ్‌ ప్రాంతంలో తల్లి కొడుకులు నివసించేవారట. కొడుకు ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడి జైలుకు రావడంతో ఆ తల్లి ఈ సాహసానికి ఒడిగట్టింది. ఆమె పేరునుగానీ, ఆమె కొడుకు పేరునుగానీ వెల్లడించేందుకు ఉక్రెయిన్‌ జైలు అధికారులు నిరాకరించారు. ఉక్రెయిన్‌ ప్రజలు మాత్రం ఆ మాతమూర్తిని ప్రశంసలతో ముంచెత్తారు. కొడుకు కోసం ఆ తల్లి చేసిన సాహసాన్ని వారు మెచ్చుకున్నారు. 

మరిన్ని వార్తలు