అఫ్గానిస్తాన్‌ కొత్త అధ్యక్షుడిగా బరాదర్‌?

19 Aug, 2021 04:13 IST|Sakshi

తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడికి అఫ్గాన్‌ పగ్గాలు 

రంగం సిద్ధం చేస్తున్న తాలిబన్లు

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ అధ్యక్షుడిగా పని చేసిన అష్రాఫ్‌ ఘనీ తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించడంతో విదేశాలకు పరారయ్యారు. దేశంలో ఇక తాలిబన్‌ పాలన ఖాయమే అని తేలినప్పటికీ తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఇప్పటికే చర్చ మొదలయ్యింది. తాలిబన్‌ ముఠా సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత డిప్యూటీ నేత ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కల్లోల అఫ్గాన్‌ పాలనా పగ్గాలను బరాదర్‌కు కట్టబెట్టేందుకు తాలిబన్లు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాలిబన్ల రాజకీయ విభాగం చీఫ్‌గా పలుదేశాలతో సంబంధాలు నెరపడం ఆయనకు అనుకూలించే అంశమని భావిస్తున్నారు.  

ముల్లా ఒమర్‌కు కుడిభుజం
ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ 1968లో అఫ్గానిస్తాన్‌లోని ఉరుజ్‌గన్‌ ప్రావిన్స్‌లో దే రహ్‌వోద్‌ జిల్లాలో వీత్‌మాక్‌ అనే గ్రామంలో జన్మించారు. పుట్టుక రీత్యా సదోజాయ్‌ తెగకు చెందిన దుర్రానీ పుష్తూన్‌ వర్గానికి చెందినవాడు. యువకులుగా ఉన్నప్పుడే ముల్లా మహమ్మద్‌ ఒమర్, బరాదర్‌ మంచి స్నేహితులయ్యారు. 1980వ దశకంలో కాందహార్‌ ప్రాంతంలో సోవియట్‌–అఫ్గాన్‌ యుద్దంలో బారదార్‌ పాల్గొన్నాడు. అప్పట్లో సోవియట్‌ యూనియన్‌ మద్దతుతో కొనసాగుతున్న అఫ్గానిస్తాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఫ్గాన్‌ ముజాహిదీన్‌ అనే సంస్థలో చేరి పోరాటం సాగించాడు. నిజానికి మొదట్లో అతడి పేరు చివరన బరాదర్‌ లేదు.

ప్రాణ స్నేహితుడు, తాలిబన్‌ వ్యవస్థాపకుడైన ముల్లా మహమ్మద్‌ ఒమర్‌ అతడి పేరు చివర బరాదర్‌(సోదరుడు) అని చేర్చాడు. సోవియట్‌–అఫ్గాన్‌ యుద్దం తర్వాత కాందహార్‌ ప్రావిన్స్‌లోని మైవాంద్‌లో ఒమర్‌తో కలిసి ఓ మదర్సాను బరాదర్‌ నిర్వహించాడు. దక్షిణ అఫ్గానిస్తాన్‌లో తాలిబన్‌ ముఠాను స్థాపించేందుకు ఒమర్‌కు తోడుగా నిలిచాడు. కుడిభుజంగా వ్యవహరించాడు. అఫ్గాన్‌లో 1996 నుంచి 2001 వరకూ కొనసాగిన తాలిబన్‌ పాలనలో బరాదర్‌ ఎన్నో కీలక పదవులు దక్కించుకున్నాడు. హెరాత్, నిమ్రుజ్‌ ప్రావిన్స్‌ల గవర్నర్‌గా పనిచేశాడు. ఆర్మీ స్టాఫ్‌ డిప్యూటీ చీఫ్‌గా, సెంట్రల్‌ ఆర్మీ కార్ప్స్‌ కమాండర్‌గానూ సేవలందించినట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ డిప్యూటీ మినిస్టర్‌గా కూడా పనిచేసినట్లు అమెరికాకు చెందిన ఇంటర్‌పోల్‌ వెల్లడించింది.

► ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ తాలిబన్ల ఆధ్యాత్మిక కేంద్రం, వారి పాలన కొనసాగినప్పుడు రాజధాని అయిన రెండో అతిపెద్ద నగరం కాందహార్‌కు మంగళవారం చేరుకున్నాడు.

► బరాదర్‌ గత కొన్న నెలలుగా ఖతార్‌లోనే గడిపాడు. అమెరికాతోపాటు అఫ్గాన్‌ ప్రతినిధులతో శాంతి చర్చల్లో పాలు పంచుకున్నాడు.

► అఫ్గాన్‌ నుంచి అమెరికా సైనిక బలగాల ఉపసంహరణపై జరిగిన చర్చల్లో బరాదర్‌దే కీలక పాత్ర.

► తాలిబన్‌ మిలటరీ ఆపరేషన్లలో చురుగ్గా వ్యవహరించడంతోపాటు 2004, 2009లో అఫ్గాన్‌ ప్రభుత్వంతో శాంతి చర్చలకు చొరవ చూపాడు.

► కాందహార్‌ ఎయిర్‌పోర్టులో ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌కు ఘన స్వాగతం లభించింది. తాలిబన్లు అతడికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడ పండుగ వాతావరణం కనిపించింది.

బరాదర్‌ అరెస్టు.. టర్నింగ్‌ పాయింట్‌
2001 సెప్టెంబర్‌ 11న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై అల్‌ కాయిదా దాడుల తర్వాత అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్‌పై దండెత్తింది. అమెరికా మద్దతు ఉన్న నార్తన్‌ అలయెన్స్‌కు వ్యతిరేకంగా బరాదర్‌ పోరాటం ప్రారంభించాడు. 2010 ఫిబ్రవరి 8న పాకిస్తాన్‌లోని కరాచీలో అరెస్టయ్యాడు. బరాదర్‌ అరెస్టు తాలిబన్లపై తాము సాగిస్తున్న యుద్ధంలో టర్నింగ్‌ పాయింట్‌ అని అమెరికా సైనికాధికారులు వ్యాఖ్యానించారంటే అతడి స్థాయిని అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్‌ ప్రభుత్వం బరాదర్‌ను జైలు నుంచి విడుదల చేసినట్లు 2018 అక్టోబర్‌ 25న తాలిబన్లు ప్రకటించారు.

అమెరికా ఒత్తిడి కారణంగానే పాక్‌ ప్రభుత్వం అతడిని విడుదల చేసినట్లు సమాచారం. విడుదలైన తర్వాత ఖతార్‌ రాజధాని దోహాకు చేరుకున్నాడు. దోహాలోని తాలిబన్‌ దౌత్య కార్యాలయం అధినేతగా నియమితుడయ్యాడు. అమెరికాతో జరిగిన చర్చల్లో తాలిబన్ల తరపున పాల్గొన్నాడు. 2020 ఫిబ్రవరిలో అఫ్గాన్‌ నుంచి అమెరికా సేనల ఉపసంహరణకు సంబంధించిన దోహా ఒప్పందంపై సంతకం చేశాడు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత 2021 ఆగస్టు 17న ఖతార్‌ నుంచి స్వదేశం అఫ్గానిస్తాన్‌కు తిరిగొచ్చాడు. 2001లో తాలిబన్‌ ప్రభుత్వం పతనమైన తర్వాత అతడు అఫ్గాన్‌లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి.

మరిన్ని వార్తలు