గ్వాడర్‌లో చైనా వాళ్లపై ఆత్మాహుతి దాడులు

21 Aug, 2021 07:29 IST|Sakshi

పాకిస్థాన్‌లో చైనీయులపై ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌ తీర నగరం గ్వాడర్‌లో భారీ ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృత్యువాత పడినట్లు, ముగ్గురు గాయపడినట్లు సమాచారం. ఈస్ట్ బే రోడ్డులో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో చైనీయులతో వెళ్తున్న ఓ కారుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. 

ఈ ఆత్మాహుతి దాడిని పాకిస్థాన్‌ ప్రభుత్వం ఖండించింది. ఘటన సమాచారం అందుకోగానే క్షతగాతత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు బెలూచిస్థాన్‌ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ది బెలూచిస్థాన్‌ పోస్ట్‌ మాత్రం మరోలా కథనం ప్రచురించింది. పేలుడులో తొమ్మిది మంది చైనా ప్రజలు మృత్యువాతపడ్డట్లు కథనం వెలువరించింది. చైనా-పాక్‌ ఎకనమిక్‌ కారిడార్‌​(CPEC) రోడ్డు నిర్మాణ ప్రాంతం వద్ద వెళ్తున్న చైనా సైట్‌ ఇంజినీర్లపై దాడి జరిగిందని, తొమ్మిది మంది మృతి చెందారని కథనంలో పేర్కొంది. ఈ కథనంపై స్పష్టత రావాల్సి ఉంది.

బెలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. చైనా-పాక్‌ ఎకనమిక్‌ కారిడార్‌ నిర్మాణం పూర్తి కాకుండా అడ్డుకుంటామని ఎప్పటి నుంచో చెప్తోంది కూడా. చైనాలో మైనారిటీ వర్గం ఉయిగుర్ల ఉచకోత ఘటనలకు ప్రతీకారంగానే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్లు బెలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. పోయిన నెలలో ఖైబర్‌-ఫంక్తువా ప్రోవిన్స్‌ వద్ద చైనా వర్కర్లతో వెళ్తున్న ఓ బస్సుపై ఆత్మాహుతి దాడి జరగ్గా.. 9మంది చైనీయులు, మరో నలుగురు పాక్‌ పౌరులు మృత్యువాత పడ్డారు. అయితే బస్సు గ్యాస్‌ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని పాక్‌ ప్రకటించగా.. చైనా మాత్రం అది ఆత్మాహుతి దాడేనని వాదించింది. ఈ తరుణంలో పాక్‌ ప్రభుత్వం ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది కూడా.

చదవండి: ముగ్గురు పిల్లలు ముద్దు!!-చైనా

మరిన్ని వార్తలు