Mumbai To Dubai: 70 లక్షలు అయ్యేదేమో.. కానీ 18 వేలకే!

26 May, 2021 12:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విమాన ప్రయాణికుడికి బంపర్‌ ఆఫర్‌

ముంబై- దుబాయ్‌ ఒక్కడే ప్యాసింజర్‌

ఇదొక అద్భుత అనుభవం

వెబ్‌డెస్క్‌: ఒక్కరి కోసమే విమానం మొత్తం బుక్‌ చేసుకోవాలనుకుంటే లక్షలు కుమ్మరించాల్సి ఉంటుంది. అంతేకాదు విలాసవంతమైన సేవలు పొందాలనుకుంటే అదనంగా మరింత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రూ. 18 వేలకే.. 360 సీట్ల సామర్థ్యం ఉన్న బోయింగ్‌-777 విమానంలో ప్రయాణం చేసే అవకాశం వస్తే.. అది కూడా ఎయిర్‌హోస్టెస్‌ మొదలు కమాండర్‌ వరకు సాదర స్వాగతం పలికి విమానమంతా కలియదిరిగే అవకాశం ఇస్తే.. భలేగా ఉంటుంది కదా. దుబాయ్‌లో నివసించే భవేశ్‌ జవేరీ అనే వ్యక్తికి ఈ బంపర్‌ ఆఫర్‌ తగిలింది. ముంబై- దుబాయ్‌ వరకు ఆయన ఒక్కరే విమానంలో ప్రయాణం చేశారు.

వివరాలు... కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం తమ పౌరులు, యూఏఈ గోల్డెన్‌ వీసా కలిగి ఉన్నవారు, దౌత్యవేత్తలకు మాత్రమే తమ దేశానికి అనుమతినిస్తూ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ముంబై నుంచి దుబాయ్‌ వెళ్లాలనుకున్న జవేరి... 18 వేల రూపాయలు పెట్టి ఎకానమీ క్లాస్‌ టికెట్‌ కొనుగోలు చేశారు. అయితే, ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించగానే టికెట్‌పై సరైన తేదీ లేని కారణంగా లోపలికి అనుమతించమని అధికారులు తేల్చి చెప్పారు. 

అస్సలు ఊహించలేదు!
వెంటనే జవేరి, ఎమిరేట్స్‌ సిబ్బందికి ఫోన్‌ చేయగా సమస్యకు పరిష్కారం దొరికింది. అంతేకాదు, ఆరోజు ఆ విమానంలో ప్రయాణించే వ్యక్తి తానొక్కడినే అని, ఆయన కోసమే ఎదురుచూస్తున్నామని చెప్పడంతో జవేరి ఆశ్చర్యపోయారు. మే 19 నాటి ఈ ఘటన గురించి భవేశ్‌ జవేరి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘విమానంలోకి అడుగుపెట్టగానే ఎయిర్‌హోస్టెస్‌ చప్పట్లు కొడుతూ నన్ను లోపలికి ఆహ్వానించారు. విమానం అంతా తిప్పి చూపించారు. నా లక్కీ నంబర్‌ 18 అని చెప్పగానే.. ఆ నంబరు గల సీట్లో కూర్చోమన్నారు.  కమాండర్‌ సైతం ఎంతో సరదాగా మాట్లాడారు.

ల్యాండ్‌ అవగానే నవ్వుతూ నాకు వీడ్కోలు పలికారు. నిజానికి ఇలా నేనొక్కడినే అంత పెద్ద విమానం(బోయింగ్‌ 777 చార్టర్‌)లో ప్రయాణించాలంటే సుమారు రూ. లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు అత్యంత తక్కువ ధరకే నాకు ఈ అవకాశం లభించింది. ఇప్పటికి దాదాపు 240సార్లు విమానాల్లో(ముంబై- దుబాయ్‌) ప్రయాణించి ఉంటాను. అంతేకాదు అప్పట్లో తొమ్మిది మంది ప్యాసింజర్లతో దుబాయ్‌ వెళ్తున్న 14 సీట్ల విమానంలోనూ ప్రయాణం చేశాను. కానీ, ఎప్పుడూ ఇలాంటి అద్భుత అనుభవం ఎదురుకాలేదు. డబ్బుతో ఇలాంటి వాటిని కొనుగోలు చేయలేం. కాలం కలిసి వస్తేనే ఇలా జరుగుతుంది కాబోలు’’ అని సంతోషం వ్యక్తం చేశారు.

కాగా భవేశ్‌ జవేరి గత రెండు దశాబ్దాలుగా యూఏఈలో నివాసం ఉంటున్నారు. ఇక ఇలాంటి ఒంటరి ప్రయాణం కోసం సుమారు 70 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చేదని ఓ ఆపరేటర్‌ చెప్పినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

చదవండి: నిజాయతీ: చేతికి దొరికిన రూ.7 కోట్లు తిరిగిచ్చేశారు

మరిన్ని వార్తలు