నాడు యాంకర్‌గా...నేడు రోడ్లపై తినుబండారాలు అమ్ముకుంటూ...

16 Jun, 2022 18:39 IST|Sakshi

Photo Of Journalist Surviving In Afghanistan Viral:  తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ని స్వాధీనం చేసుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి అఫ్గనిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ మేరకు తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గనిస్తాన్ జర్నలిస్ట్‌ ప్రాణాలతో బయటపడిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఫోటోని అఫ్గాన్‌లోని మునుపటి హమీద్‌ కర్జాయ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన కబీర్‌ హక్మల్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

అతని పేరు మూసా మొహమ్మదీ అని, అతను ఒకప్పుడూ చాలా ఏళ్లు వివిధ టీవీ ఛానెళ్లలో యాంకర్‌ అండ్‌ రిపోర్టర్‌గా పనిచేశాడని పేర్కొన్నాడు. ఐతే ప్రస్తుతం తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వీధుల్లో తినుబండారాలని అమ్ముకుంటున్నాడని చెప్పాడు. అతనికి ఆదాయం లేకపోవటంతో కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తం ఈ పనిచేస్తున్నాడని వివరించాడు. ప్రస్తుతం అతని కథ ఇంటర్నెట్‌ లో  తెగ వైరల్‌ అవుతోంది.

ఇది కాస్తా నేషనల్‌ రేడియో అండ్‌ టెలివిజన్‌ డైరెక్టర్‌ జనరల్‌ అహ్మదుల్లా వాసిక్‌ దృష్టిని ఆకర్షించింది. దీంతో అతను ఆ మాజీ జర్నలిస్ట్‌కు తన ఛానెల్‌లో ఉద్యోగం ఇస్తానని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అంతేకాదు అతనికి  తమ నేషనల్‌ రేడియో అండ్‌ టెలివిజన్‌లో నియమించుకుంటామని హామీ ఇచ్చాడు.

ఐతే మొహమ్మదీలానే చాలామంది జర్నలిస్టులు, మరీ ముఖ్యంగా మహిళా జర్నలిస్ట్‌లు అఫ్గనిస్తాన్‌లో ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అదీగాక 2021లో చివరి నాలుగు నెలల్లో తలసరి ఆదాయం మూడింట ఒక వంతు పడిపోయినందున అఫ్గనిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది.

(చదవండి: మాట మార్చిన రష్యా! సంబంధాలు యథావిధిగా మెరుగవుతాయి)

మరిన్ని వార్తలు