నా టీనేజ్‌లో బంగ్లాదేశ్‌ కోసం కొట్లాడాను

26 Mar, 2021 18:49 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌తో ఉన్న అనుబంధం గుర్తుచేసుకుంటున్నారు. ఈక్రమంలో తాను మొట్టమొదటిసారి పోరాటం చేసింది బంగ్లాదేశం కోసమేనని.. అది కూడా టీనేజ్‌లో ఉన్నప్పుడు అని మోదీ గుర్తు చేసుకున్నారు. కరోనా వైరస్‌ ప్రబలిన అనంతరం తొలిసారి మోదీ విదేశీ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని మోదీ నెమరువేసుకున్నారు. బంగ్లా పర్యటనలో శుక్రవారం ప్రధాని బిజీబిజీగా గడిపారు.

బంగ్లాదేశ్‌ 50 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢాకాలోని జాతీయ పరేడ్‌ మైదానంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనాతో కలిసి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా ప్రయాణం ప్రారంభమయ్యిందే బంగ్లాదేశ్‌ స్వాతంత్రం కోసం. నా మిత్రులతో కలిసి నేను 20 ఏళ్ల వయసులో భారత్‌లో సత్యాగ్రహ దీక్ష చేశా. ఆ పోరాటం సందర్భంగా నేను జైలుకు కూడా వెళ్లా’ అని మోదీ తన రాజకీయ జీవిత అరంగేట్రాన్ని గుర్తుచేసుకున్నారు.

గొప్ప దేశం ఆవిర్భవించడానికి ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు మరువలేనివని మోదీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌ సైనికుల గొప్పదనం.. మమకారం సరిహద్దులో ఉండే భారతీయులు ఎప్పుడు మరువలేరని తెలిపారు. ‘ఇవి నా జీవితంలో మరచిపోలేని రోజులని, ఇంతటి గొప్ప కార్యక్రమంలో నేను భాగస్వామి కావడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని నరేంద్ర మోదీ చెప్పారు. అంతకుముందు బంగ్లాదేశ్‌లోని భారతీయులను మోదీ కలుసుకున్నారు. వారితో ముచ్చటించి వారితో ఫొటోలు దిగారు. రేపు కూడా బంగ్లా పర్యటనలో మోదీ బిజీబిజీగా ఉండనున్నారు.

చదవండి: 10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి..

మరిన్ని వార్తలు