100 పైగా మందిని కాల్చి చంపిన మయన్మార్‌ సైన్యం

27 Mar, 2021 17:55 IST|Sakshi
నేషనల్‌ ఆర్మీ డే సందర్భంగా పెరేడ్‌ నిర్వహిస్తున్న సైన్యం

మయన్మార్‌ : దేశంలో సైనిక ప్రభుత్వ హింసాకాండలు ఏ మాత్రం తగ్గడం లేదు. తమ ప్రభుత్వాన్ని ఎదురిస్తున్నవారిని దారుణంగా బలితీసుకుంటోంది. శనివారం 100 మందికిపైగా నిరసనకారుల్ని సైనిక బలగాలు కాల్చి చంపాయి. నిన్న, ఫిబ్రవరి 1 సైనిక చర్యను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో నిరసనకారులు యాంగాన్‌, మాండలే, మరికొన్ని పట్టణాల్లోని వీధుల్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో సైనిక బలగాలు వారి తలలు, వీపులపై కాల్పులు జరిపాయి. చనిపోయిన వారిలో ఐదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మాండలే పట్టణంలో 13 మంది మరణించగా.. దేశ వ్యాప్తంగా 100 మందికి పైగా చనిపోయారు. నేషనల్‌ ఆర్మీ డేన ఈ దారుణం జరగటం గమనార్హం.

కాగా, ఫిబ్రవరి నెలలో మయన్మార్‌ ప్రధాని ఆంగ్‌ సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. సైనిక పాలనకు వ్యతిరేకంగా అప్పటినుంచి ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లు వెత్తుతూనే ఉన్నాయి. నిరసనలను అదుపు చేసే నెపంతో సైనిక బలగాలు ప్రజల్ని పొట్టన పెట్టుకుంటున్నాయి. సైన్యం ఇప్పటి  వరకు 400 మందికిపైగా నిరసనకారుల్ని కాల్చి చంపేసింది.

చదవండి, చదివించండి : టాటా ఏస్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి ఆర్తనాదాలు..

మరిన్ని వార్తలు