మయన్మార్‌: ఏడాది పూర్తైనా ఆరని మంటలు.. పోరాటంలో మరణాలు వేలల్లోనే!

2 Feb, 2022 10:53 IST|Sakshi

అనూహ్యంగా మొదలైన సైన్యం తిరుగుబాటు పరిణామాలతో.. ఏడాదిగా పౌరుల వ్యతిరేక నిరసనలు కొనసాగుతూనే వస్తున్నాయి. ఈ నిరసనల్లో చెలరేగిన హింసతో వేలమంది బలికాగా.. కొన్ని వేలమందిని నిర్భంధానికే పరిమితం  చేసింది సైన్యం. ఇక ఈ పరిస్థితులు కొనసాగుతుండగా.. మయన్మార్‌ సంక్షోభం గురించి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం అధికారికంగా ఒక నివేదిక విడుదల చేసింది. 

ఏడాదిపాటుగా మయన్మార్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై ఐరాస మంగళవారం అధికారికంగా స్పందించింది. ఈ ఏడాది కాలంలో పదిహేను వందల మంది బలికాగా.. 11, 782 మందిని చట్టాన్ని అతిక్రమించి సైన్యం నిర్భంధించిందని, వీళ్లలో 8,792 మంది ఇంకా నిర్భంధంలోనే ఉన్నారని ఐరాస మానవ హక్కుల విభాగం ప్రతినిధి రవీనా శమ్‌దాసానీ తెలిపారు. 

అయితే మయన్మార్‌లో పాలక జుంటా సైన్యం..  హక్కుల సంఘాలు విడుదల చేసిన మరణాల సంఖ్యను ఖండించిన విషయం తెలిసిందే. 

జెనీవాలోని జరిగిన యూఎన్‌ సమావేశంలో ఏకపక్ష నిర్బంధాల గణాంకాలపై శమ్‌సదానీ వివరణ ఇచ్చారు. ఏడాది కాలంగా సైన్యానికి వ్యతిరేకంగా వినిపిస్తున్న నిరసన ఇది. శాంతియుత ప్రదర్శనలు, ఆన్‌లైన్‌ ద్వారా తమ నిరసన గళం వినిపిస్తున్నారు. కానీ, ప్రాణ నష్టం తప్పలేదు.  చంపబడ్డ 1,500 మందిని మేం డాక్యుమెంట్ చేశాం. అయితే ఇది నిరసనల సందర్భంలో మాత్రమే’’ అని శామ్‌సదానీ వివరించారు. వీళ్లలో 200 మంది మిలిటరీ కస్టడీలో వేధింపుల ద్వారానే చనిపోయారు అని ఆమె ధృవీకరించారు. 

ఈ 1,500 మందిలో సాయుధ పోరాటం కారణంగా మరణించిన వ్యక్తులను చేర్చలేదు! ఎందుకంటే మరణించిన వాళ్లు వేలల్లో ఉన్నారని మేము అర్థం చేసుకోగలం’ ఆమె భావోద్వేగంగా ప్రసంగించారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో ఉవ్వెత్తున​ ఎగిసిన మయన్మార్‌ సైన్య దురాగతాలు.. వేలమంది పౌరులను బలిగొనడంతో పాటు ఆంక్షలతో, కఠిన నిర్భంధాలతో ఇబ్బందులు పెడుతూ వస్తోంది. మరోవైపు గత పాలకులపైనా సైన్యం ప్రతీకారం కొనసాగుతూ వస్తోంది. ఆంగ్‌సాన్‌ సూకీతోపాటు పలువురు నేతలను నిర్బంధంలో ఉంచి సైన్యం పలు అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు