షాకింగ్.. నేలపై నుంచి కాల్పులు.. విమానంలోని ప్రయాణికుడికి తీవ్ర గాయాలు

2 Oct, 2022 17:49 IST|Sakshi

మయన్మార్‌లో షాకింగ్ ఘటన జరిగింది. నేషనల్ ఎయిర్‌ లైన్స్‌ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి బుల్లెట్ తగిలింది. దీంతో అతనికి తీవ్ర గాయమైంది. నేలపై నుంచి ఎవరో కాల్పులు జరపడంతో విమానం పైకప్పుకు రంద్రంపడి బుల్లెట్ లోనికి దూసుకెళ్లింది. అనంతరం లోయికావ్‌ నగరంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికుడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

బ్రిటీష్ వార్త సంస్థ వివరాల ప్రకారం విమానం 3,500 అడుగుల ఎత్తులో, విమానాశ్రయానికి నాలుగు మైళ్ల దూరంలో ప్రయాణిస్తోంది.  ఈ ఘటన జరిగిన వెంటనే లోయికావ్‌ విమానాశ్రయానికి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే విమానంపై కాల్పులు జరిపింది కచ్చితంగా రెబల్ గ్రూప్‌కు చెందిన వారే అని మయన్మార్ సైన్యం తెలిపింది. కరెన్ని నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన ఉగ్రవాదులే ఈ చర్యకు పాల్పడినట్లు వెల్లడించింది. రెబల్స్ గ్రూప్స్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించాయి.

మయన్మార్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సాయుధ దళాలు, సంప్రదాయ తెగలు పోరాటం చేస్తున్నాయి. పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్‌ అనుబంధ సంస్థలే విమానంపై కాల్పులు జరిపాయని మయన్మార్ మిలిటరీ కౌన్సిల్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్‌ జామ్ మిన్ టున్ తెలిపారు.

మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధ్యక్షురాలు ఆంగ్‌ సాన్‌ సూకీని జైలుకు తరలించిన నాటి నుంచి ఆ దేశంలో అనేక చోట్ల సాయుధ దాళాలు పోరాటం చేస్తున్నాయి. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు విమానంపై కాల్పులు జరిగిన కాయా రాష్ట్రంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
చదవండి: ఉక్రెయిన్‌ వ్యూహంతో రష్యా ఉక్కిరిబిక్కిరి.. ఆ నగరం వదిలి పరార్‌!

మరిన్ని వార్తలు