ట్రెండింగ్‌లో ‘మై నేమ్‌ ఈజ్‌’

20 Oct, 2020 04:18 IST|Sakshi

వాషింగ్టన్‌: డెమొక్రాటిక్‌ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలాహారిస్‌ పేరును రిపబ్లికన్‌ సెనేటర్‌ తప్పుగా పలకడం ఆమె మద్దతుదారులకు ఆగ్రహం తెప్పించింది. ఇందుకు నిరసనగా బైడెన్‌ బృంద ఏసియన్‌ అమెరికన్‌ పసిఫిక్‌ ఐలాండర్‌ కోఆర్డినేటర్‌ అమిత్‌ జాని ఆరంభించిన ‘‘మై నేమ్‌ ఈజ్‌..’’ క్యాంపైన్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. జార్జియాకు చెందిన రిపబ్లికన్‌ సెనేటర్‌ డేవిడ్‌ పెర్‌డ్యూ ఇటీవల ఒక ర్యాలీలో కమలా హారిస్‌ పేరును వ్యంగంగా ఉచ్ఛరించారు. ‘‘ఖ మ లా? ఖ మ్మ లా? కమలా మలా మాలా? ఏమో నాకు తెలీదు.. ఏదో ఒకటిలే’’ అని ఆయన ర్యాలీలో కమలా హారిస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.

దీంతో పలువురు సోషల్‌ మీడియాలో తమ పేరు ఉత్పత్తి, అర్థాన్ని వివరిస్తూ పోస్టులు పెట్టడం ఆరంభించారు. డేవిడ్‌ కావాలనే కమలా పేరును అలా పలికారని, నాలుగేళ్లు తనతో పనిచేసిన తోటి సెనేటర్‌ పేరును గుర్తుంచుకోలేరా? అని కమలా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ #MyN్చఝ్ఛఐటహ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు ట్రెండ్‌ అవుతున్నాయి. పలువురు సెలబ్రెటీలు కూడా ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేశారు. డేవిడ్‌ సమర్థకులు మాత్రం ఈ ఆగ్రహాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. సెనేటర్‌ డేవిడ్‌ తెలీక కమలా పేరును తప్పుగా పలికారని, ఇందులో ఎలాంటి దురర్ధం లేదని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. గతంలోకూడా కమలా పేరును కొందరు కావాలని తప్పుగా పలకడం గమనార్హం.

మరిన్ని వార్తలు