వింత పదార్థం.. ఇదేంటో తెలిస్తే మాకు చెప్పగలరు

20 May, 2021 15:59 IST|Sakshi

సాధారణంగా మనం ఎప్పుడూ చూడని కొత్తవి, వింతవి ఎదురుగా కనిపిస్తే ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోతాం. ఒకవేళ అవి భయంకరంగా, వికారంగా ఉంటే మాత్రం భయపడతాం. ఈ విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా సముద్రాల్లో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సముద్ర అడుగు భాగంలో ఇప్పటి వరకూ గుర్తించని, ఏముందో కనిపెట్టని జీవులూ ఉంటాయి. అచ్చం అలాంటి ఓ వింత పదార్థాన్ని నార్త్‌ కరోలినా తీరంలో నేషనల్‌ పార్క్‌ అధికారులు కనుగొన్నారు. ఇది చూడటానికి గజిబిజీగా, చాలా పెద్దగా ఉంది. కేప్ లుకౌట్ నేషనల్ సీషోర్ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన దీనికి  కాళ్లు, చేతులు, తల వంటి భాగాలు కూడా లేవు.

‘అంతుచిక్కని పదార్థం’ అని క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ ఫోటోలో ఉన్న జీవి కొన్ని నెలల క్రితమే  సముద్ర ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అయితే ఇటీవల సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో దీన్నిచూసిన వారంతా ఏంటని ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. దీని ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారుతున్నాయి. దీనిని గుర్తించడంలో అధికారులు ప్రజల సలహా కోరుతున్నారు. ఇదొక ప్రమాదకరమైన జీవి అనుకొని స్థానికులందరూ భయపడుతున్నారు. కాగా ఇది చేపలాగా ఉంటే స్క్విడ్‌ గుడ్డు కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇది అనేక ఆకారాలను కలిగి ఉంది. చిన్న చిన్న తెలుపు రంగు బాల్స్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది.

‘బీచ్ మిస్టరీ - ఈ రహస్యమైన జంతువేంటో ఏమిటో మీకు తెలుసా? ఇది కొన్ని నెలల క్రితం బీచ్‌లో కనుగొన్నాం.. ఇప్పటివరకు దీనిని గుర్తించలేకపోయాం. అయితే ఇది స్క్విడ్‌కు చెందిన గుడ్డుగా భావిస్తున్నాం. ఖచ్చితంగా తెలియదు. ఎవరైనా గుర్తించడంలో మాకు సాయం చేయగలరా అని పేర్కొన్నారు.’ కాగా ఈ పోస్టుపై స్పందించిన చాలామంది అవి స్క్విడ్ గుడ్లు అని చెప్పి, వాటిని తిరిగి సముద్రంలో వదిలి పెట్టమని అధికారులను కోరారు.

మరిన్ని వార్తలు