ఎక్కడున్నా.. పక్కనున్నట్టే..

20 Apr, 2022 02:21 IST|Sakshi

ఒక్క బటన్‌ నొక్కగానే అక్కడెక్కడో ఉన్న వ్యక్తి ఠక్కున ఓ కాంతి రూపంలో ప్రత్యక్షమై మాట్లాడటం చాలా హాలీవుడ్‌ సినిమాల్లో చూసే ఉంటారు. సినిమాల్లో కనిపించిన ఈ టెక్నాలజీ ఇప్పుడు నాసా వాళ్లు కూడా వాడేస్తున్నారు. ఈ టెక్నాలజీ సాయంతోనే ఓ నాసా డాక్టర్, ఆయన బృందం.. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో ఆమధ్య ప్రత్యక్షమయ్యారు. ఫ్రెంచ్‌ ఆస్ట్రొనాట్‌తో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వార్త తాజాగా బయటకు వచ్చింది. ఇంతకీ ఇందుకోసం వాడిన సాంకేతికత పేరేంటో తెలుసా.. ‘హోలోపోర్టేషన్‌’. భూమి నుంచి అంతరిక్షంలోకి హోలోపోర్ట్‌ అయిన తొలి మనుషులు ఈ నాసా డాక్టర్ల బృందమే.  
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌      

ఏంటీ  హోలోపోర్టేషన్‌?
హోలోపోర్టేషన్‌ టెక్నాలజీ సాయంతో మనుషులను 3డీ రూపంలో ఎక్కడైనా ప్రత్యక్షమయ్యేలా చేయొచ్చు. ఈ టెక్నాలజీ కోసం తయారు చేసిన లెన్స్‌ల సాయంతో అలా ప్రత్యక్షమైన ఎదుటి వ్యక్తులు చెప్పేది వినొచ్చు, వాళ్లతో మాట్లాడవచ్చు. అంటే.. ఎక్కడో ఉన్న వ్యక్తి ఈ టెక్నాలజీ సాయంతో మన పక్కనే, మన ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందన్నమాట. 

మైక్రోసాఫ్ట్‌ 2016 నుంచి..
హోలోపోర్టేషన్‌ టెక్నాలజీని మైక్రోసాఫ్ట్‌ సంస్థ 2016 నుంచి వాడుతోంది. హోలోపోర్టేషన్‌ మానవులు సృష్టించిన అద్భుతమైన టెక్నాలజీ అని, మనం ఫిజికల్‌గా వెళ్లలేని ప్రాంతాలకు దీని సాయంతో  చేరుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. స్పేస్‌ స్టేషన్‌ గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నా, భూమికి 400 కిలోమీటర్ల పైన ఉన్నా ఈ సాంకేతికతతో ఠక్కున అక్కడ ప్రత్యక్షమై వ్యోమగాములతో మాట్లాడొచ్చంటున్నారు.

 మున్ముందు ఎక్కడెక్కడ వాడొచ్చు?
కరోనా మహమ్మారి తర్వాత టెలీ మెడిసిన్‌ విధానం బాగా పెరిగిందని, ఈ టెక్నాలజీని టెలీ మెడిసిన్‌కు జోడిస్తే మంచి ఫలితాలుంటాయని నాసా వివరించింది. హాప్టిక్‌ (టచ్‌ టెక్నాలజీ)తో హోలోపోర్టేషన్‌ను కలిపి వాడి ఒక పరికరంపై ఇద్దరూ కలిసి పని చేసే అవకాశం ఉంటుందని.. ఆపరేషన్లు, సర్జరీల్లో ఇది మరింత ఉపయోగపడనుందని తెలిపింది. అంటార్కిటికా ఖండం, ఆయిల్‌ రిగ్స్‌ లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పని చేస్తున్న వాళ్లతో ఈ టెక్నాలజీ సాయంతో మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పింది. త్వరలో మార్స్‌కు వ్యోమగాములను పంపనున్నామని, డీప్‌ స్పేస్‌ మిషన్‌లలో కూడా హోలోపోర్టేషన్‌ వాడే అవకాశం ఉందని వివరించింది.

 నాసా  ఏమంటోంది?
గతేడాది అక్టోబర్‌లో ఈ టెక్నాలజీని వాడి స్పేస్‌ స్టేషన్‌లోని వ్యోమగాములతో తమ డాక్టర్ల బృందం మాట్లాడిందని నాసా చెప్పింది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన హోలోలెన్స్‌ కైనెక్ట్‌ కెమెరా, అవసరమైన సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఇది సాధ్యమైందని వివరించింది. ‘ఈ టెక్నాలజీని మున్ముందు మేము ప్రైవేట్‌ మెడికల్‌ కాన్ఫరెన్స్‌లు, ప్రైవేట్‌ సైకియాట్రిక్‌ కాన్ఫరెన్స్‌లు, ప్రైవేట్‌ ఫ్యామిలీ కాన్ఫరెన్స్‌ల కోసం వాడతాం. అలాగే వీఐపీలు వ్యోమగాములతో మాట్లాడేందుకు కూడా వినియోగిస్తాం’ అని నాసా చెప్పింది.

మరిన్ని వార్తలు