ముంగిట్లో ముప్పు!

17 Mar, 2021 09:24 IST|Sakshi

మార్చి 21న భూమికి దగ్గరగా..

సౌర వ్యవస్థలో గ్రహాలు, ఉపగ్రహాలతోపాటు ఎన్నో గ్రహశకలాలు (ఆస్టరాయిడ్స్‌) సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని గ్రహశకలాలు భూమికి దగ్గరగా వచ్చి వెళ్తుంటాయి. అలాగే ఈ ఏడాది భూమికి దగ్గరగా రానున్న ఓ భారీ గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. 2001 ఎఫ్‌వో32 అనే ఈ భారీ గ్రహశకలం ఈ ఏడాది మార్చి 21న భూమికి దగ్గరగా 1.25 మిలియన్‌ మైళ్ల (2 మిలియన్‌ కిలోమీటర్లు) సమీపంలోకి చేరుకుంటుందని నాసా వెల్లడించింది. అంతేకాకుండా, ఈ అతిపెద్ద గ్రహశకలాన్ని దగ్గరగా పరిశీలించి, అనేక విషయాలను కనుగొనడానికి నాసా సిద్ధమైంది. దీని గురించి ఇటీవల నాసా వెల్లడించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. 

2001 ఎఫ్‌వో32గా పిలువబడే ఈ భారీ గ్రహశకలాన్ని 20 సంవత్సరాల క్రితమే శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వ్యాసం సుమారు 3,000 అడుగులు ఉన్నట్లు అంచనా వేశారు. ఈ గ్రహశకలం సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య మార్గాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం వల్ల ఇది భూమికి 1.25 మిలియన్‌ మైళ్ల కంటే దగ్గరగా వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ దూరం భూమి నుంచి చంద్రుడికి మధ్య గల దూరానికి 5.25 రెట్లు అధికం అయినప్పటికీ దీనిని ప్రమాదకరమైన గ్రహశకలంగానే భావించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు భూమికి అతి సమీపంగా వచ్చిన గ్రహశకలాలన్నింటితో పోల్చితే ఈ 2001 ఎఫ్‌వో32 వేగం గంటకు 77,000 మైళ్లు అధికంగా ఉందని పేర్కొంటున్నారు. 

ఆస్టరాయిడ్స్‌ ఉపరితలంపై పడి పరావర్తనం చెందే సూర్యకాంతిని అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు దాని పరిమాణాన్ని, దాని ఉపరితలంపై ఉండే ఖనిజాలు, వాటి రసాయన కూర్పులను గురించి తెలుసుకుంటారు. ఇటువంటి భారీ గ్రహశకలం భూమికి సమీపంగా రావడమనేది వాటి గురించి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు ఒక అద్భుతమైన అవకాశం అని నాసా శాస్త్రవేత్త లాన్స్‌ బెన్నర్‌ అన్నారు. ఈ నెల 21న 2001 ఎఫ్‌వో32 గ్రహశకలం భూమికి సమీపంగా వచ్చినప్పుడు మిగతా ప్రాంతాలతో పోల్చితే దక్షిణార్థ గోళంలో ఉన్న వారికి ఇది మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుందని, అక్కడ ఉన్న ఔత్సాహిక ఖగోళ శాస్త్రజ్ఞులు దీనిని ఆధునిక టెలిస్కోపులు, స్టార్‌ చార్టుల సహాయంతో పరిశీలించవచ్చన్నారు. భూమికి దగ్గరగా ఉన్న గ్రహశకలాలలో 2001ఎఫ్‌వో32 లేదా అంతకుమించి పరిమాణం ఉన్న దాదాపు 95 శాతం గ్రహశకలాల జాబితా తయారు చేశామని, రాబోయే 100 సంవత్సరాలలో వాటిలో ఏ ఒక్కటీ భూమిని తాకే అవకాశం లేదని నాసా తెలిపింది.

భూమిని తాకిన శకలం 
సుమారు వందేళ్ల క్రితం.. అంటే 1908, జూన్‌ 30న ఓ గ్రహశకలం సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతంలో భూమిని తాకింది. ఇటీవలి ప్రపంచ చరిత్రలో భూమిపై పడ్డ ఆస్టరాయిడ్‌ ఇదేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తుంగుస్కా ప్రాంతంలో ఆస్టరాయిడ్‌ దెబ్బకు భారీ ఎత్తున అడవి ధ్వంసమైంది. ఆ దెబ్బకు 830 చదరపు మైళ్లలోని 8 కోట్ల చెట్లు సర్వనాశనమయ్యాయి. అయితే ఇది ఇనప ఖనిజంతో కూడిన ఆస్టరాయిడ్‌ అని రష్యా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిని ఢీకొట్టిన తర్వాత అది మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లిపోయిందని వారు చెబుతున్నారు. అయితే దీనికి భిన్నంగా మరికొంత మంది శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. ఆ ఆస్టరాయిడ్‌ మంచుతో కూడుకున్నదని, భూమిని ఢీకొట్టాక కరిగిపోయిందని చెబుతున్నారు. కాగా, ఆస్టరాయిడ్స్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో తుంగుస్కా ఘటన జరిగిన జూన్‌ 30వ తేదీని ‘ఇంటర్నేషనల్‌ ఆస్టరాయిడ్‌ డే’గా 2016లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

చదవండి:  విజయవంతమైన స్టార్ షిప్ పరీక్ష, కానీ?

మరిన్ని వార్తలు