అపూర్వ విజయమది

19 Dec, 2022 05:34 IST|Sakshi

గ్రహ శకల ప్రయోగం ‘డార్ట్‌’పై నాసా

అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి

భూమిపైకి దూసుకొచ్చే ప్రమాదమున్న గ్రహశకలాలను అంతరిక్షంలోనే ఢీకొట్టి దారి మళ్లించడం ద్వారా మనకు ముప్పు తప్పించే లక్ష్యంతో సెప్టెంబర్‌లో నాసా చేపట్టిన చరిత్రాత్మక డార్ట్‌ (డబుల్‌ ఆస్టిరాయిడ్‌ రీడైరెక్టన్‌) ప్రయోగం దిగ్విజయం కావడం తెలిసిందే. ఇందులో భాగంగా భూమికి ఏకంగా 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో డిడిమోస్‌ అనే పెద్ద గ్రహశకలం చుట్టూ పరిభ్రమిస్తున్న డైమోర్ఫస్‌ అనే బుల్లి శకలాన్ని 570 కిలోల బరువున్న డార్ట్‌ ఉపగ్రహం గంటకు ఏకంగా 22,500 కిలోమీటర్ల వేగంతో ఢీకొంది.

ఆ ప్రయోగ ఫలితాలపై పలు కోణాల్లో అధ్యయనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కీలక విషయాలు తాజాగా వెలుగు చూశాయి. ప్రయోగం ద్వారా డైమోర్ఫస్‌ కక్ష్యను మార్చడం సైంటిస్టుల ప్రధాన లక్ష్యం. అది వారు ఆశించిన దానికంటే చాలా ఎక్కువగా నెరవేరిందని తాజాగా తేలింది. డిడిమోస్‌ చుట్టూ దాని పరిభ్రమణ కాలం ఏకంగా 32 నిమిషాల మేరకు తగ్గిందని వెల్లడైంది. ‘‘అందుకే డార్ట్‌ ప్రయోగం మామూలు విజయం కాదు. ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ ఫలితమిచ్చింది’’ అని నాసా సైంటిస్టులు సంబరంగా చెబుతున్నారు.

అంతేకాదు, డార్ట్‌ ఢీకొన్నప్పుడు దాని ఊహాతీత వేగపు ధాటికి డైమోర్ఫస్‌ నుంచి కనీసం 10 లక్షల కిలోల బరువైన ఉపరితల పదార్థాలు ముక్కచెక్కలుగా అంతరిక్షంలో దూసుకెళ్లాయట. అంతరిక్షంలో ఇలా ఒక వస్తువు ఢీకొనే వేగం వల్ల రెండో వస్తువుపై పడే ఒత్తిడిని ద్రవ్యవేగపు మార్పిడిగా పేర్కొంటారు. ‘‘డార్ట్‌ ప్రయోగం వల్ల జరిగిన ద్రవ్యవేగపు మార్పిడిని ‘బెటా’గా పిలుస్తాం. అర టన్ను బరువున్న ఏ వస్తువైనా గ్రహశకలం ఆకర్షణ శక్తికి లోబడి దానికేసి దూసుకెళ్తే జరిగే దానికంటే డార్ట్‌ ప్రయోగం వల్ల 3.6 రెట్లు ఎక్కువగా ద్రవ్యవేగపు మార్పిడి జరిగింది.

డార్ట్‌ ప్రయాణించిన గంటకు 22,500 కిలోమీటర్ల వేగమే ఇందుకు కారణం’’ అని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ అప్లైడ్‌ ఫిజిక్స్‌ ల్యాబ్‌కు చెందిన డార్ట్‌ మిషన్‌ సైంటిస్టు డాక్టర్‌ ఆండీ చెంగ్‌ వివరించారు. ‘‘ఈ ద్రవ్యవేగపు మార్పిడి ఎంత ఎక్కువగా ఉంటే గ్రహశకలాన్ని అంతగా దారి మళ్లించడం వీలవుతుంది. భూమిని నిజంగానే గ్రహశకలాల బారినుంచి కాపాడాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు ఇది చాలా కీలకంగా మారగలదు. డార్ట్‌ ప్రయోగం ద్వారా మనకు అందుబాటులోకి వచ్చిన అతి కీలక సమాచారమిది’’ అని ఆయన చెప్పారు.

‘‘అందుకే డార్ట్‌ ప్రయోగాన్ని ఊహకు కూడా అందనంతటి గొప్ప విజయంగా చెప్పాలి. దీనివల్ల గ్రహ శకలాల ముప్పును తప్పించేంత సామర్థ్యం మనకు ఇప్పటికిప్పుడే సమకూరిందని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఆ దిశగా మనం వేసిన అతి పెద్ద ముందడుగుగా మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు’’ అని నాసా డార్ట్‌ ప్రోగ్రాంలో కీలకంగా పని చేసిన సైంటిస్టు డాక్టర్‌ టామ్‌ స్టాట్లర్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా దీనిపై స్పందించారు. 2022లో నాసా సాధించిన మూడు ఘన విజయా ల్లో డార్ట్‌ ప్రయోగం ఒకటంటూ ప్రశంసించారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు