అంగారక గ్రహంపై ఆక్సిజన్‌...!

22 Apr, 2021 16:33 IST|Sakshi
చిత్రం: నాసా, పర్సివరెన్స్‌లో అమర్చిన మోక్సీ పరికరం

వాషింగ్టన్‌: మానవ మనుగడ కోసం భూమి కాకుండా మరో గ్రహాం కోసం నాసా అనేక పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం అంగారక గ్రహంపై నాసా పరిశోధనలు చేస్తోంది. పరిశోధనల్లో భాగంగా అంగారక గ్రహంపైకి పెర్సివరెన్స్‌ రోవర్‌ను పంపగా, ఈ రోవర్‌‌ అంగారక గ్రహంపై పలు పరిశోధనలు చేస్తోంది. అంగారక గ్రహంపై తొలిసారిగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసింది. మార్స్‌ వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చడంలో నాసా ముందడుగు వేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి పర్సివరెన్స్‌ రోవర్‌లో  ‘మోక్సీ ’అనే పరికరాన్ని అమర్చారు. ఈ పరికరం మార్టిన్‌ వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ను గ్రహించి, ఎలక్ట్రాలసిస్‌ ప్రక్రియ ద్వారా కార్బన్‌ డయాక్సైడ్‌ను విచ్చినం చేసి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తోంది. కాగా, తొలి ప్రయోగంలో మోక్సీ పరికరం 5గ్రాముల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగా, ఇది వ్యోమగామికి  అందించే సుమారు 10 నిమిషాల విలువైన శ్వాసకు సమానం అని నాసా తెలిపింది.

ఏడు నెలల ప్రయాణం తరువాత ఫిబ్రవరి 18న అంగారక గ్రహంపైకి అడుగుపెట్టిన నాసా రోవర్ పర్సివరెన్స్‌తో పంపిన ఇన్‌జేన్యూటి, మోక్సీ తమ తొలి ప్రయోగంలో విజయవంతంగా ప్రయోగింపబడ్డాయి. ఆక్సిజన్‌ ఉత్పత్తి మానవ మనుగడకు కీలక మైలురాయి అని నాసా పేర్కొంది. దీంతో  భవిష్యత్‌లో ఆక్సిజన్‌ను భూమి నుంచి తీసుకెళ్లే బాధతప్పింది. ఆక్సిజన్‌ను తీసుకెళ్లడానికి బదులుగా మార్టిన్ వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చే యంత్రాన్ని తీసుకెళ్లడం చాలా సులువని అంతరిక్ష పరిశోధకులు భావిస్తున్నారు. అంగారక గ్రహంపై సుమారు 95 శాతం వరకు కార్బన్‌ డయాక్సైడ్‌ ఉంది. 

చదవండి: నాసా సాధించిన మరో ఘన విజయం..మార్స్‌పై తొలిసారిగా..

మరిన్ని వార్తలు