ఏలియన్స్ జాడ కోసం వేదాంత వేత్తలను నియమించుకుంటున్న నాసా..!

28 Dec, 2021 19:55 IST|Sakshi

ఏలియన్స్ జాడ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎన్నో ఏళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఏలియన్స్ జాడ కనుక్కోవడం కోసం నాసా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రహాంతరవాసుల ఆచూకీ, రహస్యాలను తెలుసుకోవటానికి 24 మంది వేదాంత వేత్తల సహాయాన్ని కోరుతున్నట్లు టెక్నోట్రెండ్జ్ ఒక నివేదికలో తెలిపింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీలో డిగ్రీని పొందిన బ్రిటిష్ వేదాంత వేత్త రెవ్ డాక్టర్ ఆండ్రూ డేవిసన్ ఈ మిషన్‌లో భాగమయ్యారు. వచ్చే ఏడాది ఈ విషయంపై తన పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు కూడా తెలిపారు. 

నాసాలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసులు, యూఎఫ్‌ఓల రహస్యాలకు సంబంధించిన గుట్టును విప్పే పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ వేదాంత వేత్తల్ని నాసా అంతరిక్షంలోకి పంపిస్తుందా? లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. మరో గ్రహంపై జీవం కనిపించిన తర్వాత వివిధ మతాలకు చెందిన వారి స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ 24 మంది వేదాంత వేత్తల సహాయాన్ని నాసా కోరినట్లు సమాచారం. ఈ నెల డిసెంబర్ 26న హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ కంటే అతిపెద్ద అంతరిక్ష టెలిస్కోప్ జేమ్స్ వెబ్ ను అంతరిక్షంలోకి నాసా, యూరోప్ దేశాలు ప్రయోగించాయి. ఈ టెలిస్కోప్ సహాయంతో విశ్వం పుట్టుకతో పాటు, ఏలియన్స్ జాడ కూడా తెలుసుకోవాలని నాసా భావిస్తుంది.

(చదవండి: జనవరి 1 నుంచి మరో కొత్త నిబంధన అమల్లోకి!)

మరిన్ని వార్తలు