మార్స్‌పై బుల్లి హెలీకాప్టర్‌‌, దానికి పేరు పెట్టిందెవరో తెలుసా?

11 Apr, 2021 08:22 IST|Sakshi

మార్స్‌పై రైట్‌.. రైట్‌..

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ అంగారకుడిపైకి చేపట్టిన ‘పర్సవరెన్స్‌’రోవర్‌ ప్రాజెక్టులో భాగంగా ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను పంపారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు చేసినా.. మొదటిసారిగా మరో గ్రహంపై హెలికాప్టర్‌ను వినియోగించనుండటం ఇదే తొలిసారి. పర్సవరెన్స్‌ రోవర్‌తోపాటు ఇన్‌జెన్యుటీని పంపినా.. దీనిని పూర్తి ప్రత్యేక ప్రయోగంగానే నిర్వహిస్తున్నారు. అంగారకుడిపై పగటి ఉష్ణోగ్రతలు 55 డిగ్రీల వరకు పెరిగి.. రాత్రికి మైనస్‌ 90 డిగ్రీల వరకు పడిపోతుంటాయి.

అక్కడి గాలి చాలా పలుచగా.. భూమితో పోలిస్తే ఒకశాతమే ఉంటుంది. ఈ పరిస్థితులను హెలికాప్టర్‌ తట్టుకోగలదా?, ఎంత కెపాసిటీతో ఎంత దూరం వరకు ఎగరగలదు?, భవిష్యత్తులో ఏమేం మార్పులు చేయాలన్న అంశాలను పరిశీలించనున్నారు. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో మార్స్‌పై గాల్లో ఎగురుతూ పరిశీలించే హెలికాప్టర్‌ను పంపుతామని నాసా ఇప్పటికే ప్రకటించింది.

అది 1903వ సంవత్సరం.. డిసెంబర్‌ 17..
ప్రపంచ చరిత్ర మారిపోవడానికి కారణంగా నిలిచిన రోజు.. మనిషి తొలిసారిగా గాలిలో ఎగిరిన రోజు. రైట్‌ బ్రదర్స్‌ తాము తయారు చేసిన విమానంలో  తొలిసారిగా ప్రయాణించిన రోజు.. 

ఎంత దూరం.. ఎంత సమయం? 
మార్స్‌ నుంచి భూమికి దూరం 27.7 కోట్ల కిలోమీటర్లు 
అక్కడి నుంచి ఇక్కడికి సమాచారం చేరడానికి పట్టే సమయం 16 నిమిషాలు 
మినీ హెలికాప్టర్‌ నుంచి డేటా పర్సవరెన్స్‌ రోవర్‌కు.. అక్కడి నుంచి మార్స్‌ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌కు.. దాని నుంచి భూమిపై ఉన్న నాసా డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌కు డేటా ట్రాన్స్‌ఫర్‌ జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయి డేటా ఓపెన్‌ కావడానికి గంటకుపైగా పడుతుంది. 

ఇన్‌జెన్యూటీ ఏంటి.. ఏమున్నాయి? 
►  ఈ మినీ హెలికాప్టర్‌ బరువు 1.8 కిలోలు. బరువు తక్కువగా ఉండే అధునాతన మెటీరియల్స్‌తో తయారు చేశారు. 
►  రెండు రోటార్లు, వాటికి అమర్చిన రెండు జతల కార్బన్‌ ఫైబర్‌ బ్లేడ్లతో గాల్లోకి ఎగురుతుంది. 
 హెలికాప్టర్‌ రోటార్లు నిమిషానికి 2,400 చుట్లు తిరుగుతాయి. 
 పరిశీలన, పరిశోధనల కోసం మూడు ప్రత్యేకమైన కెమెరాలు, లేజర్, ఇతర పరికరాలు ఉన్నాయి. 
  ఇన్‌జెన్యుటీ పొద్దంతా చార్జింగ్‌ చేసుకుంటుంది. రాత్రి అతిశీతల పరిస్థితిని తట్టుకునేందుకు.. లోపలి నుంచి వేడి చేసుకుంటూ ఉంటుంది.

సుమారు 118 ఏళ్ల తర్వాత..  2021, ఏప్రిల్‌ 11..
మానవ జాతి చరిత్రలో నిలిచిపోనున్న మరో అద్భుతమైన రోజు.. తొలిసారిగా భూమి అవతలమరో గ్రహమైన అంగారకుడిపై మినీ హెలికాప్టర్‌ గాల్లో ఎగరనున్న రోజు.. 

ఒక్కో చోట ఒక్కో టైం.. 
ఆదివారం ఉదయం 12.30 నిమిషాలకు ఇన్‌జెన్యుటీ మార్స్‌పై గాల్లోకి ఎగరనుంది. అది భూమ్మీది టైం కాదు అంగారకుడి మీది సమయం. అదే భూమ్మీద ఈస్టర్న్‌ స్టాండర్డ్‌ టైం (ఈఎస్‌టీ – అమెరికాలో వినియోగించే టైం) లెక్కన చూస్తే.. ఆదివారం రాత్రి 10.54 గంటలు అవుతుందని నాసా ప్రకటించింది. మన ఇండియాలో ఇది సోమవారం పొద్దున 8.24 గంటలు అవుతుంది. అయితే మార్స్‌పై డేటా రికార్డై పూర్తిగా భూమికి చేరే సరికి అమెరికా టైంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలు, ఇండియా టైంలో మధ్యాహ్నం రెండు గంటల సమయం అవుతుందని అంచనా. 

మొదట 90 సెకన్లే.. 
 మార్స్‌ ఉపరితలంపై పది అడుగుల ఎత్తులో ఇన్‌జెన్యుటీ ప్రయాణిస్తుంది. 
 ఒక్కో ప్రయాణంలో 90 సెకన్ల పాటు తిరుగుతూ ఫొటోలు తీస్తుంది. 
 భూమి నుంచి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్‌పై హెలికాప్టర్‌ను రియల్‌ టైంలో కంట్రోల్‌ చేయడం సాధ్యం కాదు. అందుకే హెలికాప్టర్‌ దానికి నిర్దేశించిన సూచనల ఆధారంగా సొంతంగానే గాల్లో ఎగురుతూ.. పరిశీలిస్తుంది. 

పేరు పెట్టింది భారత సంతతి అమ్మాయే.. 
‘ఇన్‌జెన్యూటీ’అంటే చాతుర్యం, బుద్ధి కుశలత అని అర్థం. శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి, తమ మేధస్సును వాడి ఈ మినీ హెలికాప్టర్‌ను తయారు చేశారన్న ఉద్దేశంతో ఈ పేరును ఎంపిక చేశారు. మరి ఈ పేరును సూచించింది ఎవరో తెలుసా? అమెరికాలోని అలబామాలో ఉండే 17 ఏళ్ల భారత సంతతి అమ్మాయి వనీజా రూపానీ. నాసా నిర్వహించిన ‘నేమ్‌ ద రోవర్‌’పోటీకి వచ్చిన 28 వేల ఎంట్రీల నుంచి ఈ పేరును ఫైనల్‌ చేశారు.
చదవండి: 3 వేల ఏళ్ల తర్వాత బయటపడిన ‘బంగారు నగరం’

మరిన్ని వార్తలు