సుదూర తార చిక్కిన వేళ...

8 Aug, 2022 06:36 IST|Sakshi

ఫొటోలో బాణం గుర్తు ఎదురుగా మిణుకుమిణుకుమంటూన్న చిన్న వెలుగు కన్పిస్తోందా? లేదా? అయితే ఇన్‌సెట్లో చూడండి. కంటికి కొద్దిగా ఆనుతోంది కదా! అదేమిటో తెలుసా? మనకు తెలిసిన విశ్వమంతటిలోనూ అత్యంత సుదూరంలో ఉన్న నక్షత్రం. పేరు ఎరెండల్‌. జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ తాజాగా దీన్ని క్లిక్‌మనిపించింది. ఇది సన్‌రైజ్‌ ఆర్క్‌ అనే గెలాక్సీలో ఉందట.

ఇంతకూ ఈ గెలాక్సీ మనకు ఎంత దూరంలో ఉందో తెలుసా? ఏకంగా 2,800 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో! ఇంతటి దూరాల్లో సాధారణంగా పాలపుంతలు మాత్రమే కన్పిస్తాయి.  అలా చూస్తే ఈ సుదూర తార మనకు కన్పించడం యాదృచ్చికంగా కలిసొచ్చిన అదృష్టమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటిదాకా మనకు చిక్కిన అత్యంత సుదూరంలోని తార కేవలం 1,000 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దానికంటే ఎరెండల్‌ ఏకంగా 1,800 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్నమాట.

ఇది ముందుగా హబుల్‌ టెలిస్కోప్‌కు కన్పించిందట. దాంతో ఆశ్చర్యానికి లోనైన నాసా సైంటిస్టులు జూలై 30న జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ ద్వారా కూడా పరీక్షించారు. దాని ఉనికి నిజమేనని నిర్ధారించుకుని ఆశ్చర్యానందాలకు లోనయ్యారట. దీని కాంతి భూమిని చేరేందుకు ఏకంగా 1,290 కోట్ల కాంతి సంవత్సరాలు పట్టిందట! ఆ లెక్కన మనకిప్పుడు చిక్కిన ఎరెండెల్‌ రూపం బిగ్‌బ్యాంగ్‌ అనంతరం కేవలం 90 కోట్ల ఏళ్ల నాటిదని సైంటిస్టులు వివరిస్తున్నారు. ఎరెండెల్‌ అంటే వేకువ తార అని అర్థం. మనకు కన్పిస్తున్న ఎరెండెల్‌ రూపం విశ్వపు తొలి నాళ్లకు చెందినది గనుక ఈ పేరు సరిగ్గా నప్పిందంటూ సంబరపడుతున్నారు.

మరిన్ని వార్తలు