James Webb Telescope Launch: కోట్లు మింగేసిన టెలిస్కోప్‌! విశ్వం పుట్టుక.. గుట్టు వీడేనా?

15 Dec, 2021 04:55 IST|Sakshi

వచ్చే వారం జేమ్స్‌వెబ్‌ టెలిస్కోపు ప్రయోగం

25 ఏళ్ల కృషి.. 1,000 కోట్ల డాలర్ల వ్యయం

20 దేశాల సహకారంతో నాసా రూపకల్పన

బిగ్‌బ్యాంగ్‌ రహస్యాలను శోధించే యత్నం

విశ్వ రహస్యాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఆదిమ కాలం నుంచి మానవుడికి ఉండేది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ జిజ్ఞాసతో టెలిస్కోపుల నిర్మాణం చేపట్టాడు. ఈ క్రమంలో తాజాగా అతిపెద్ద టెలిస్కోపును నిర్మించడం జరిగింది. ఇంతవరకు విశ్వ రహస్యాలను అందిస్తూ వస్తున్న హబుల్‌ టెలిస్కోపుకు వారసురాలిగా, అంతకన్నా శక్తివంతమైనదిగా తీర్చిదిద్దిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు ప్రయోగం డిసెంబర్‌ 22న జరగనుంది. బిగ్‌బ్యాంగ్‌ అనంతర పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భవ అంశాలను లోతుగా పరిశీలించేందుకు ఈ టెలిస్కోప్‌ ఎంతగానో ఉపయోగపడనుంది. విశ్వ రహస్యాలను వివరంగా చూపించే ఈ టెలిస్కోపు నిర్మాణం నుంచి ప్రయోగం వరకు అనేక విశేషాలున్నాయి. అవేంటో చూద్దాం..

10,000 మంది
యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, కెనడా స్పేస్‌ ఏజెన్సీల సహకారంతో నాసా ఈ టెలిస్కోపును అభివృద్ది చేస్తోంది. దాదాపు 20కి పైగా దేశాలకు ఈ టెలిస్కోపు నిర్మాణంలో భాగస్వామ్యముంది. ఏరియన్‌ 5 స్పేస్‌ రాకెట్‌లో ఫ్రెంచ్‌ గినియాలోని గినియాస్పేస్‌ సెంటర్‌ నుంచి దీన్ని అంతరిక్షంలోకి పంపిస్తారు. దీని నిర్మాణంలో దాదాపు 10వేల మంది సైంటిస్టులు 4 కోట్ల పనిగంటల పాటు కష్టపడ్డారు.

25 సంవత్సరాలు
1996లో ఎన్‌జీఎస్‌టీ పేరిట ఈ టెలిస్కోపు ప్రాజెక్టు ఆరంభమైంది. 2002లో దీనికి జేమ్స్‌ వెబ్‌ పేరును పెట్టారు. సుదీర్ఘకాలం పట్టిన ఈ టెలిస్కోపు నిర్మాణం సాఫీగా జరగలేదు. నిధుల కొరతతో ప్రాజెక్టు చాలా ఆలస్యం అయింది. 2011లో అమెరికా చట్టసభల కేటాయింపుల కమిటీ ఈ ప్రాజెక్టును ఏకంగా రద్దు చేయాలని పత్రిపాదించింది. ఆ సమయంలో దీన్ని నేచర్‌ పత్రిక ‘ఖగోళ నిధులు మింగేస్తున్న టెలిస్కోపు’గా అభివర్ణించింది. అయితే రద్దు ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా కాంగ్రెస్‌ టెలిస్కోపు నిర్మాణాన్ని కొనసాగించే నిధులను కేటాయించింది. దీంతో సుమారు 25 సంవత్సరాల కృషి అనంతరం 2021కి టెలిస్కోపు సిద్ధమైంది.

రూ.76 వేల కోట్లు
సుదీర్ఘకాలం కొనసాగడంతో దీని నిర్మాణానికి చాలా నిధులు వెచ్చించారు. 1996లో ఈ టెలిస్కోపు నిర్మాణ అంచనా నిధులు 50 కోట్ల డాలర్లు కాగా, 2021లో పూర్తయ్యేనాటికి 1,000 కోట్ల డాలర్ల (సుమారు 76 వేల కోట్ల రూపాయలు) వ్యయమైంది.  

లక్షల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమణం
డిసెంబర్‌ 22న ప్రయోగంతో దీన్ని భూమి– సూర్యుల మధ్య ఉన్న ఎల్‌2 లాంగ్రేజియన్‌ బిందువు వద్దకు చేరుస్తారు. ఇది భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఇది భూమిలా సూర్యుని చూట్టూ పరిభ్రమిస్తుంటుంది. టెలిస్కోపులోని దర్పణాలను, పరికరాలను –220 డిగ్రీల సెల్సియస్‌ వద్ద చల్లగా ఉంచేందుకు దీనికి సిలికాన్, అల్యూమినియం పూత పూసిన సౌర కవచాన్ని తొడిగారు. హబుల్‌ భూమికి సుమారు 550 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తోంది.

11 రోజులు
ప్రయోగించిన 11 రోజులకు ఇది ఎల్‌2 పాయింటుకు చేరుకుంటుంది. అక్కడ కక్ష్యలో ప్రవేశించాక అంతవరకు ముడుచుకుని ఉన్న దర్పణం తెరుచుకొని పని ప్రారంభిస్తుంది. ఇందులో ప్రాథమిక దర్పణం కాకుండా మరో మూడు దర్పణాలు, లైట్‌ డిటెక్టర్, స్టార్‌ ట్రాకర్స్, సోలార్‌ ప్యానెల్స్, యాంటెన్నాలాంటి ఇతర భాగాలుంటాయి.

458 జీబీ
కక్ష్యలోకి చేరాక ఇది రోజుకు 458 గిగాబైట్ల డేటాను పదేళ్ల పాటు పంపగలదు.

1350 కోట్ల సంవత్సరాల క్రితం కాంతి
బిగ్‌ బ్యాంగ్‌ అనంతరం ఏర్పడ్డ తొలి నక్షత్రాలు, గాలక్సీల నుండి వెలువడ్డ కాంతి కోసం అన్వేషణ, గెలాక్సీల నిర్మాణం, పరిణామాలను, నక్షత్ర, గ్రహ వ్యవస్థల ఏర్పాటును అధ్యయనం చేయడం, జీవావిర్భావాన్ని పరిశోధించడం లక్ష్యంగా ఈ టెలిస్కోపు పనిచేయనుంది. జేమ్స్‌ వెబ్‌ పరారుణ సామర్థ్యంతో బిగ్‌ బ్యాంగ్‌ అనంతరం కొన్ని పదుల కోట్ల సంవత్సరాల తరువాత ఏర్పడిన తొలి గెలాక్సీల గురించి పరిశీలించవచ్చు. విశ్వం ఆవిర్భవించి ఇప్పటికి సుమారు 1380 కోట్ల సంవత్సరాలైందని అంచనా. ఈ టెలిస్కోపు సుమారు 1350 కోట్ల సంవత్సరాల పూర్వపు కాంతిని పసిగట్టగలదు.

ఆసక్తి ఉన్న సైంటిస్టులు డైరెక్టర్స్‌ డిస్క్రెషనరీ ఎర్లీ రిలీస్‌ సైన్స్‌(డిడి–ఇఆర్‌ఎస్‌) కార్యక్రమం, గ్యారెంటీడ్‌ టైమ్‌ అబ్జర్వేషన్స్‌(జిటిఓ) కార్యక్రమం, జనరల్‌ అబ్జర్వర్స్‌(జిఓ) కార్యక్రమాల ద్వారా ఈ టెలిస్కోపును వాడుకొని ఖగోళ పరిశోధన చేసేందుకు సమయాన్నిస్తారు.
 
నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు