వ్యోమగాముల ఆహారంపై పోటీ.. గెలిస్తే లక్షలు మీసొంతం

15 Feb, 2021 16:26 IST|Sakshi

సుదీర్ఘ కాలం నిల్వ ఉండే ఆహారం కోసం అన్వేషణ

‘డీప్‌ స్పేస్‌ ఫుడ్‌’ అనే సరికొత్త చాలెంజ్‌

వాషింగ్టన్‌: అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా (నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌)  అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన ఓ విషయమై ఔత్సాహికులు లేదా వంటల విషయమై అనుభవజ్ఞులైన వారికి ఓ ఆఫర్‌ ప్రకటించింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల కోసం తిండి పదార్థాలు ఏం తీసుకెళ్లాలనే విషయం మీరు చెప్పాలి. అంతరిక్షంలో ఆ వాతావరణాన్ని తట్టుకుని పాడవకుండా నెలల పాటు నిల్వ ఉండే ఆహార పదార్థాలు చెబితే మీరు కొన్ని వేల డాలర్లు సొంతం చేసుకోవచ్చు.

మార్స్ (అంగారకుడు)పైకి వ్యోమగాములను పంపించే ప్రయత్నాలు నాసా ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో వ్యోమగాములు అంగారక గ్రహంపై ఉండేందుకు వారికి కావాల్సిన ఆహార పదార్థాలను సిద్ధం చేయడానికి తంటాలు పడుతోంది. ఏ ఆహారం తీసుకెళ్లినా కొన్ని నెలలకు పాడవుతుంది. కానీ వ్యోమగాములకు మూడేళ్ల పాటు ఆహారం నిల్వ ఉండే పదార్థాలను తెలపాలని నాసా సలహాలు ఆహ్వానిస్తోంది. 

మూడేళ్ల సుదీర్ఘ ప్ర‌యాణంలో వ్యోమగాముకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో చెప్పిన వారికి 5 ల‌క్ష‌ల డాల‌ర్ల బ‌హుమ‌తి ప్ర‌క‌టించింది. దీనికి ‘డీప్ స్పేస్ ఫుడ్’ చాలెంజ్ అనే పేరు పెట్టారు. స్పేస్ మిష‌న్ల‌లో వ్యోమగాముల ఆహారానికి సంబంధించి కొత్త వ్య‌వ‌స్థ‌లు, టెక్నాల‌జీల‌ను క‌నుగొనాల‌ని నాసా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. అంగారకుడిపైకి వెళ్లిరావడం కలిపితే క‌నీసం మూడేళ్లు ప‌డుతుంది. ఈ సుదీర్ఘ యాత్రలో వ్యోమగాములకు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం ఉండాలి. అయితే వారికి అవసరమైన ఆహార పదార్థాలు పంపితే అక్కడి వాతావరణం తట్టుకుంటాయా లేదా నిల్వ ఉంటాయా అనే దానిపై మీమాంస ఏర్పడింది. వారికి కావాల్సినంత ఆహారాన్ని రాకెట్‌లో పంపే ప‌రిస్థితి కూడా లేదు. దీంతో వారి ఆహారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్ప‌టికే ‘అల్ట్రా హై కేల‌రీ చాక్లెట్ బార్ల‌ను’ క‌నుగొన్నారు. అయితే సుదీర్ఘ ప్ర‌యాణానికి అది స‌రిప‌డా పంపించాలంటే బరువుతో కూడుకున్నది. అవి పంపిస్తే రాకెట్ బ‌రువు పెరిగి ప్రయోగం వికటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త మార్గాల్లో వ్యోమగాములకు ఆహారం అందించ‌డంపై పోటీ పెట్టారు. వినూత్న ఆలోచ‌న‌లను తమతో పంచుకోవాల‌ని నాసా పిలుపునిచ్చింది. కొత్త తరహాలో ఆలోచించేవాళ్లు మే 28వ తేదీ వ‌ర‌కు రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చని నాసా సూచించింది. జూలై 30వ తేదీలోపు త‌న వినూత్న ప్రాజెక్ట్‌ల‌ను నాసాకు అందించాలి. టాప్ 20 బృందాలకు ఒక్కొక్క‌రికి 25 వేల డాల‌ర్ల చొప్పున మొత్తం 5 ల‌క్ష‌ల డాల‌ర్లు అందిస్తామని నాసా ప్రకటించింది. అయితే ఈ ఆఫ‌ర్ కేవ‌లం అమెరికావాసులకు మాత్ర‌మే ప‌రిమితం చేశారు.
 

మరిన్ని వార్తలు