హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ప్రమాదం.. నాసా వార్నింగ్‌

11 Mar, 2023 07:39 IST|Sakshi

2046వ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజును గ్రాండ్‌గా సెలబ్రేషన్‌ ప్లాన్‌ చేస్తున్నారా? అయితే, విరమించుకోండి.. మీరు  విన్నది నిజమే.. ఎందుకంటే.. ఆ రోజున ఓ గ్రహ శకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందట. అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ ఈ మేరకు హెచ్చరించింది. మరి ఏమిటా గ్రహశకలం? ఎక్కడ పడే అవకాశముంది? ఎంత నష్టం జరుగుతుందనే వివరాలు మీకోసం..  

ఒక భారీ గ్రహశకలం.. దాదాపు ఆరు కోట్ల ఏళ్ల కింద భూమిని ఢీకొడితే డైనోసార్లు సహా 90శాతానికిపైగా జీవరాశి తుడిచిపెట్టుకుపోయింది. తర్వాత మరికొన్ని గ్రహశకలాలు వాటి స్థాయిలో విధ్వంసం సృష్టించాయి. ఇప్పుడూ అలాంటి ప్రమాదం ముంచుకు వస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హెచ్చరించింది. 2046 ఫిబ్ర వరి 14న సాయంత్రం 4.44 గంటల (ఈస్టర్న్‌ టైం)కు ‘2023డీడబ్ల్యూ’ గ్రహశకలం భూమిని ఢీకొనవచ్చని పేర్కొంది (భారత కాలమానం ప్రకారం.. ఫిబ్రవరి 15న తెల్లవారుజామున 3.14 గంటలకు).  ఇటలీలోని పీసా టవర్‌(186 అడుగులు)కు కాస్త దగ్గరగా 165 అడుగుల పరిమాణంలో ఈ గ్రహ శకలం ఉందని తెలిపింది. 

కొన్ని వారాలుగా పరిశీలించాక.. 
‘2023డీడబ్ల్యూ’ గ్రహశకలాన్ని కొన్నివారాల క్రితమే గుర్తించారు. దాని ప్రయాణమార్గం, వేగం, ఇతర అంశాలను పరిశీలించిన ఓ ఇటాలియన్‌ ఆస్ట్రానమర్‌.. భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసాను అలర్ట్‌ చేశారు. తొలుత 1,200 చాన్సుల్లో ఒకసారి అది ఢీకొట్టవచ్చని భావించారు. నిశితంగా పరిశీలించాక.. 710 చాన్సుల్లో ఒకసారికి, తర్వాత 560 చాన్సుల్లో ఒకసారికి మార్చారు. అంటే ప్రమాద అవకాశం మరింత పెరుగుతోందన్న మాట. 

అమెరికా నుంచి భారత్‌ దాకా..
‘2023డీడబ్ల్యూ’ గ్రహశకలం హిందూ మహా సముద్రం నుంచి పసిఫిక్‌ మహాసముద్రం దాకా ఎక్కడైనా పడొచ్చని నాసా అంచనా వేసింది. అమెరికాలోని హవాయి, లాస్‌ ఏంజిలిస్, వాషింగ్టన్‌ వంటి నగరాలూ ఈ మార్గంలో ఉన్నాయని పేర్కొంది. నాసా అంచనా వేసిన మ్యాప్‌ ప్రకారం.. తర్వాతి స్థానాల్లో ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌ థాయ్‌లాండ్, ఇండియా, గల్ఫ్‌ దేశాలు కూడా ఉన్నాయి. అయితే.. వీటికి ప్రమాదం తక్కువ. 

టొరినో స్కేల్‌పై లెవల్‌-1 వద్ద..
భూకంపాలను రిక్టర్‌ స్కేల్‌తో కొలిచినట్టే.. గ్రహశకలాలు ఢీకొట్టే ప్రమాదాన్ని టొరినో స్కేల్‌తో కొలుస్తారు. దాని పరిమాణం, వేగం, భూమికి ఎంత దగ్గరగా ప్రయాణిస్తుందనే అంశాల ఆధారంగా లెవల్‌ రేటింగ్‌ ఇస్తారు. ‘2023డీడబ్ల్యూ’తో ప్రమాదాన్ని లెవల్‌–1 వద్ద సూచించారు. మరింత కచి్చతమైన పరిశీలన తర్వాత స్థాయిని పెంచుతారు. లెవల్‌–3 దాటితే ప్రజల కు హెచ్చరికలు జారీ చేస్తారు. 

అంతుకుముందుతో పోలిస్తే.. 
1908లో దాదాపు 160 అడుగుల గ్రహశకలం రష్యాలోని సైబీరియా గగనతలంలో ఐదారు కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయింది. దీని ధాటికి సుమారు 2వేల చదరపు కిలోమీటర్లలో అడవి, జీవజాలం నాశనమైంది. జనావాసాలకు దూరంగా జరగడంతో మరణాలు నమోదు కాలేదు. కానీ ఆ పేలుడు తీవ్రత జపాన్‌లోని హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే వెయ్యి రెట్లు ఎక్కువని, నేరుగా భూమిని ఢీకొని ఉంటే భారీ విధ్వంసం జరిగేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 
- ఇప్పుడు ‘2023డీడబ్ల్యూ’ గ్రహశకలం జనావాసాలు ఉన్నచోట ఢీకొంటే.. ఒక పెద్ద నగరమంత వైశాల్యంలో అంతా నామరూపాలు లేకుండా పోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
 – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు