NASA: అంతరిక్షంలోకి బుల్లి జీవులు: ఎందుకు? ఎవరి కోసం?

3 Jun, 2021 10:20 IST|Sakshi

సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చిన్న చిన్న ఆక్టోపస్‌ వంటి స్క్విడ్స్‌ను, నీటి ఎలుగుబంట్ల(వాటర్‌ బేర్స్‌)ను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి పంపనుంది. స్పేస్‌ ఎక్స్‌ సీఆర్‌ఎస్‌–22 మిషన్‌ ద్వారా ఈ జలచరాలు నింగిలోకి గురువారం దూసుకుపోనున్నాయి. అయితే వీటిని ఎందుకు అంతరిక్షంలోకి పంపుతున్నారో తెలుసా? మనకోసమే.. అయితే, వీటినే ఎందుకు పంపిస్తున్నారు..? వీటిని అక్కడికి పంపడం వల్ల మనకు ఉపయోగాలేంటి? ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.. అలా అంతరిక్షం వరకూ..

ఐఎస్‌ఎస్‌.. 
అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్‌ఎస్‌)ను 1998లో ప్రారంభించారు. భూమిపై సాధ్యం కాని పరిశోధనలను అంతరిక్షంలో నిర్వహించేందుకు ఈ కేంద్రాన్ని శాస్త్రవేత్తలు వినియోగించుకుంటుంటారు. ఇప్పటివరకు ఈ కేంద్రంలో 108 దేశా లకు చెందిన పరిశోధకులు 3 వేలకు పైగా పరిశోధనలు జరిపారు.

స్పేస్‌ ఎక్స్‌ సీఆర్‌ఎస్‌–22 మిషన్‌
శాస్త్రీయ, సాంకేతిక పరికరాలను ఐఎస్‌ఎస్‌కు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి మోసుకెళ్లనుంది. స్పేస్‌ ఎక్స్‌ కార్గో రీసప్లయ్‌ మిషన్‌ (సీఆర్‌ఎం) 22వ సారి ఐఎస్‌ఎస్‌కు పరికరాలను గురువారం తీసుకెళ్లనుంది. అంతరిక్ష పరిస్థితులను వాటర్‌ బేర్స్‌ తట్టుకుంటాయా? సహజీవన ప్రక్రియపై అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఎలా ప్రభావితం చేస్తుంది? మూత్రపిండాల్లో రాళ్లు ఎలా ఏర్పడతాయి? వంటి అంశాలపై ఐఎస్‌ఎస్‌లో పరిశోధనలు నిర్వహించనున్నారు.

వాటర్‌ బేర్స్‌ ఎందుకు?  
వాటర్‌ బేర్స్‌ (టార్డిగ్రేడ్స్‌) 8 పాదాలు కలిగిన సూక్ష్మజీవులు. సాధారణ జంతుజాలం జీవించడానికి అవసరమైన వాతావరణం కన్నా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా భూమిపై, అంతరిక్షంలో ఇది మనగలుగుతుంది.  ఈ జీవి ఇలాంటి పరిస్థితుల్లో కూడా జీవించి ఉండేందుకు దోహదపడే జన్యువుల గురించి అధ్యయనం చేయనున్నారు. టార్డిగ్రేడ్స్‌ (వాటర్‌ బేర్స్‌)పై సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి ఏ విధంగా పనిచేస్తుందనే విషయం తెలుసుకునేందుకు అధ్యయనం చేయనున్నారు. ఈ వాటర్‌ బేర్స్‌ సంతానాన్ని కూడా ఇక్కడే అభివృద్ధిపరిచి, వాటిల్లో వచ్చిన జన్యు మార్పులను గుర్తించనున్నారు. అంతరిక్షంలో మానవులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని లోతుగా అర్థం చేసుకుని, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది.

 బుల్లి స్క్విడ్స్‌ ఎందుకు? 
అప్పుడే పుట్టిన స్క్విడ్‌ పారా లార్వాలను (బేబీ స్క్విడ్స్‌)ను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. ఐఎస్‌ఎస్‌లో ఈ స్క్విడ్స్‌ వేరే బ్యాక్టీరియాతో సహజీవనం చేసి ప్రత్యేక అవయవం మాదిరి కాలనీ ఏర్పడేలా చూస్తారు. ఈ అవయవాన్ని లైట్‌ ఆర్గాన్‌ అంటారు. స్క్విడ్‌ శరీరంలో బ్యాక్టీరియా వల్ల కలిగే మార్పులను రికార్డు చేస్తారు. స్క్విడ్‌– సూక్ష్మజీవుల మధ్య సంబంధంపై తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఏవిధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు పరిశోధనలు జరపనున్నారు.

ఏం తెలుసుకుంటాం..? 
సూక్ష్మజీవి–జంతువుల సహజీవనంపై అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకునేందుకు జరిగే పరిశోనలే ‘ఉమామి’. సూక్ష్మ జీవులు వాటి అతిథేయి (హోస్ట్‌– స్క్విడ్‌)పై అంతరిక్ష వాతావరణం ప్రభావం గురించి తెలుసుకునేందుకు ఉమామి పరిశోధన దోహదం చేస్తుంది. ఇప్పటివరకు ఈ జీవుల మధ్య సంబంధాలపై గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఎలా ఉంటుందో సరిగ్గా తెలియదు.
చదవండి: డెల్టా వేరియంట్‌ అత్యంత ప్రమాదకరం

మరిన్ని వార్తలు