ఆశలు రేపుతున్న నాసల్‌ వ్యాక్సిన్‌

13 Jul, 2021 02:29 IST|Sakshi

జంతువులపై పరిశోధనల్లో సత్ఫలితాలు

వాషింగ్టన్‌: కరోనాను ఎదుర్కొనేందుకు రూపొందిస్తున్న నాసల్‌ వ్యాక్సిన్‌(ముక్కు ద్వారా అందించే టీకా) ఆశాజనక ఫలితాలనిస్తోంది. క్లీనికల్‌ ప్రయోగాల్లో భాగంగా ఎలకలకు, ఫెర్రెట్లకు(ముంగీస వంటి ఒక జంతువు) సింగిల్‌డోస్‌లో ఈ వ్యాక్సిన్‌ ఇచ్చారు. టీకాతో ఎలకల్లో కరోనా నుంచి సంపూర్ణమైన రక్షణ కనిపించింది. ఫెర్రెట్‌లలో కరోనా వైరస్‌ వ్యాప్తిని టీకా సమర్ధవంతంగా అడ్డుకుంది. ఈ ప్రయోగ ఫలితాలు  జర్నల్‌ సైన్స్‌ అడ్వాన్సెస్‌లో ప్రచురితమయ్యాయి. ఫ్లూ వ్యాధికి ఇచ్చే నాసల్‌ టీకాను ఇచ్చినట్లే నాసల్‌ స్ప్రే ద్వారా ఈ టీకాను జంతువులకు ఇచ్చారు.

‘‘ప్రస్తుతం కరోనాకు వ్యతిరేకంగా వాడుతున్న టీకాలు విజయవంతమైనవే, కానీ ప్రపంచ జనాభాలో మెజార్టీ ప్రజలు ఇంకా టీకా పొందలేదు. ఈ దశలో సులభంగా వాడే వీలున్న సమర్ధవంతమైన టీకా అవసరం ఎంతో ఉంది.’’ అని జార్జియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పౌల్‌ మెక్‌క్రే అభిప్రాయపడ్డారు. నాసల్‌ టీకా మానవులపై సత్ఫ్రభావాలనిస్తే, కరోనాను విజయవంతంగా అడ్డుకోవచ్చన్నారు. ఈ టీకాను ఒక్క డోసు ఇస్తే చాలని, సాధారణ రిఫ్రిజిరేటర్లలో మూడు నెలల పాటు భద్రపరచవచ్చని పరిశోధకలు చెప్పారు. ముక్కు ద్వారా ఇవ్వడం వల్ల సూదిమందంటే భయమున్న వారు కూడా సులభంగా దీన్ని అంగీకరిస్తారన్నారు.  

ఫ్లూ వైరస్‌తో ప్రయోగాలు 
నాసల్‌ వ్యాక్సిన్‌ కోసం పరిశోధకులు పారాఇన్‌ఫ్లుయెంజా వైరస్‌5(పీఐవీ5)ను ఉపయోగించారు. దీన్ని జంతువులపై ప్రయోగించగా ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ కల్పించినట్లు పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్‌ బయో పేర్కొన్నారు. పీఐవీ 5 వైరస్‌ సైతం కరోనా వైరస్‌ లాగానే స్పైక్‌ ప్రోటీన్‌ ఉపయోగించుకొని మానవకణాల్లోకి చేరుతుంది. నాసల్‌ వ్యాక్సిన్‌ ముక్కుద్వారా ప్రవేశించగానే వాయునాళాల్లోని శ్లేష్మ పొరలో వైరస్‌ కణాలను లక్ష్యంగా చేసుకొంటాయి. ముక్కులోకి ఇచ్చిన టీకా స్థానికంగా ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ను ప్రేరేపిస్తుంది, దీంతో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ కల్పించడమే కాకుండా వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందనివ్వదన్నారు. 

మరిన్ని వార్తలు