నాసా సాధించిన మరో ఘన విజయం..

19 Apr, 2021 19:10 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో ఘన విజయాన్ని సాధించింది. మార్స్‌పై హెలికాప్టర్‌ ఇన్‌జెన్యూటీని నాసా తొలిసారిగా ఎగురవేసింది. తెల్లవారుజామున 3:34 గంటలకు,1.8 కిలోగ్రాముల బరువున్న ఇన్‌జెన్యూటీ మార్స్‌ ఉపరితలం పైన సుమారు 10 అడుగుల ఎత్తులో, 39.1 సెకన్ల పాటు ఎగిరినట్లు నాసా పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియోలను పర‍్సవరెన్స్‌ రికార్డు చేసినట్లు నాసా తెలిపింది. ఈ ప్రయోగానికి సంబంధించిన డేటాను 270 మిలియన్ల కిలోమీటర్ల నుంచి ట్రాన్స్‌మిట్‌ చేయడం కోసం సుమారు మూడు గంటల సమయం పట్టిందని నాసా పేర్కొంది. తొలుత ఈ ప్రయోగాన్ని ఏప్రిల్‌ 11న చేపట్టాలని నిర్ణయించగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ టెస్ట్‌ను నిలిపివేశారు. ఏప్రిల్‌ 22 న మరోసారి రెండో టెస్ట్‌ ఫ్లైట్‌ను జరుపనున్నట్లు తెలుస్తోంది.

హెలికాప్టర్‌ ఎగురవేయడానికి మార్స్‌పై అంతగా అనుకూల పరిస్థితులు లేకపోవడంతో శాస్త్రవేత్తలు ఈ మిషన్‌పై మొదట్లో అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం రోజున హెలికాప్టర్‌ ఇన్‌జెన్యూటీని తొలిసారిగా టెస్ట్‌ ఫ్లైట్‌ను విజయవంతంగా పూర్తి చేశామని నాసా ఓ ప్రకటనలో తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోను నాసా ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. నాసా ఈ పరీక్షను ‘రైట్‌ బ్రదర్స్‌ సోదరుల మూమెంట్‌’ గా అభివర్ణించింది.  

అంగారక గ్రహంపై పరిశోధనలు చేపట్టడానికి ‘పర్సవరెన్స్‌’రోవర్‌ను నాసా పంపిన విషయం తెలిసిందే. పర్సవరెన్స్‌ రోవర్‌  ప్రాజెక్టులో భాగంగా ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను పంపారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు చేసినా.. మొదటిసారిగా మరో గ్రహంపై హెలికాప్టర్‌ను వినియోగించనుండటం ఇదే తొలిసారి. పర్సవరెన్స్‌ రోవర్‌తోపాటు ఇన్‌జెన్యుటీని పంపినా.. దీనిని పూర్తి ప్రత్యేక ప్రయోగంగానే నిర్వహిస్తున్నారు. అంగారకుడిపై పగటి ఉష్ణోగ్రతలు 55 డిగ్రీల వరకు పెరిగి.. రాత్రికి మైనస్‌ 90 డిగ్రీల వరకు పడిపోతుంటాయి. 

చదవండి: మార్స్‌పై బుల్లి హెలీకాప్టర్‌‌, దానికి పేరు పెట్టిందెవరో తెలుసా?

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు