కెన్నెడీ హత్య.. మరిన్ని డాక్యుమెంట్లు బహిర్గతం

17 Dec, 2022 05:55 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌.కెన్నెడీ హత్యకు సంబంధించి 13 వేల పై చిలుకు డాక్యుమెంట్లను వైట్‌హౌస్‌ తాజాగా బయట పెట్టింది. దీంతో ఆ ఉదంతానికి సంబంధించి 97 శాతానికి పైగా సమాచారం జనానికి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చినట్టేనని ప్రకటించింది. అయితే మరో 515 డాక్యుమెంట్లను పూర్తిగా, 2,545 డాక్యుమెంట్లను పాక్షికంగా గోప్యంగానే ఉంచనుంది! వాటిని 2023 జూన్‌ దాకా విడుదల చేయబోమని ప్రకటించింది.

హత్యకు సంబంధించిన అతి కీలకమైన విషయాలు వాటిలోనే ఉండొచ్చని భావిస్తున్నారు. హార్వే ఓస్వాల్డ్‌ అనే వ్యక్తి 1963 నవంబర్‌ 22న కెన్నెడీని డాలస్‌లో కాల్చి చంపడం తెలిసిందే. దీని వెనక పెద్ద కుట్ర ఉందంటారు. హార్వే కొన్నేళ్లపాటు సోవియట్‌ యూనియన్‌లో ఉండొచ్చిన వ్యక్తి కావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ కెన్నెడీని చంపించి ఉంటుందని, రహస్యాన్ని శాశ్వతంగా సమాధి చేసేందుకు హార్వేను పోలీసులు కాల్చి చంపారని ఊహాగానాలున్నాయి.

మరిన్ని వార్తలు