ఉద్రిక్తతలకు కారణం నాటో పీటముడి?!

14 Feb, 2022 05:16 IST|Sakshi

కూటమిలో చేరేందుకు ఉక్రెయిన్‌ ఆరాటం

అడ్డుకోవాలని రష్యా యత్నాలు

ఒకప్పుడు కలిసిఉన్న దేశానికి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిలో చేరాలని ఉక్రెయిన్‌ ఉబలాటపడుతోంది. ఎలాగైనా ఈ చేరికను అడ్డుకోవాలని రష్యా యత్నిస్తోంది. రష్యాను తిరస్కరించి ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోవాలని యూఎస్, మిత్రపక్షాలు ఆశపడుతున్నాయి. అసలేంటీ నాటో? ఎందుకు ఇందులో చేరడానికి ఉక్రెయిన్‌కు తొందర? దీనివల్ల రష్యాకు నష్టమేంటి? అమెరికాకు లాభమేంటి? నాటో కూటమే ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలకు కారణమా?

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా లక్షకు పైగా బలగాలను మోహరించింది. పరిస్థితి చూస్తే ఏ క్షణమైనా యుద్ధం కమ్మే సూచనలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌ను ఆక్రమించే ఉద్దేశం లేదని రష్యా చెబుతున్నా, అటు పాశ్చాత్య దేశాలు, ఇటు ఉక్రెయిన్‌ నమ్మడం లేదు. రష్యా, యూఎస్‌ కూటమికి మధ్య ఈ ఉద్రిక్తతలకు అసలు కారణం నాటో కూటమేనంటున్నారు నిపుణులు. ఉక్రెయిన్‌ సంక్షోభం సమసిపోవాలంటే నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వకూడదని రష్యా షరతు పెడుతోంది. అయితే యూఎస్‌ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. నాటోలో ఉక్రెయిన్‌ చేరిక అన్ని పక్షాలకు ఎందుకు ఇంత ప్రాధాన్యాంశంగా మారిందంటే నాటో చరిత్రను, ఉక్రెయిన్‌ ప్రాముఖ్యతను తెలుసుకోవాల్సిందే!  

ఏంటీ నాటో?
రెండో ప్రపంచ యుద్ధానంతరం రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, యూకే, ఫ్రాన్స్‌తో పాటు మరో ఎనిమిది యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు 1949లో నాటో ( ద నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌)ను ఏర్పాటు చేశాయి. అనంతరం అనేక దేశాలు ఈ కూటమిలో చేరుతూ వచ్చాయి. తాజాగా 2020లో ఉత్తరమాసిడోనియా నాటోలో చేరింది. ఈ కూటమి ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్‌లో ఉంది. కేవలం యుద్ధ పరిస్థితులు ఎదురైతే కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు ఈ కూటమి ఏర్పడింది. ఐరాస లాగా ఇతర అభివృద్ధి తదితర కార్యక్రమాల్లో నాటో పాల్గొనదు.  నాటోలో చేరిన దేశాలకు మాత్రమే కూటమి రక్షణ ఉంటుంది. కనుక ఒకవేళ రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తే, ఉక్రెయిన్‌ కూటమిలో సభ్యురాలు కాదు కనుక నాటో నేరుగా స్పందించలేదు. అందుకే ఎలాగైనా ఉక్రెయిన్‌ను కూటమిలో చేర్చుకునేందుకు యూఎస్, మిత్రదేశాలు తొందరపడుతున్నాయి.  

ఉక్రెయిన్‌ అవసరాలు
1992 నుంచి నాటోతో ఉక్రెయిన్‌ సంబంధం కొనసాగుతోంది. 1997లో ఉక్రెయిన్‌– నాటో కమిషన్‌ ఏర్పాటైంది. అయితే అధికారికంగా నాటోలో ఇంతవరకు ఉక్రెయిన్‌ చేరలేదు. రష్యా తమను ప్రత్యేకంగా మిగల్చదని ఉక్రెయిన్‌ రాజకీయనాయకుల భావన. నాటోలో చేరడం ద్వారా నేరుగా నాటో కూటమి రక్షణ పొందవచ్చని వీరి ఆలోచన. సభ్యదేశాలు కానివాటి రక్షణపై నాటోకు పరిమితులున్నాయి. అందువల్ల రష్యా ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌పై దండెత్తితే నాటో స్పందన భిన్నంగా ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా కూటమిలో చేరాలని ఉక్రెయిన్‌ భావిస్తోంది. అలాగే నాటోలో చేరడం ద్వారా యూరోపియన్‌ యూనియన్‌లో కూడా సభ్యత్వం పొందవచ్చని ఉక్రెయిన్‌ నేతల ఆలోచన.

దీనివల్ల యూఎస్‌ తదితర దేశాలతో మరింత బలమైన సంబంధాలు ఏర్పడడంతో పాటు పాశ్చాత్య దేశాల ఆర్థిక అండదండలు లభిస్తాయి. అయితే నాటోలో సభ్యత్వం పొందడం అంత సులువు కాదు. కూటమిలో అన్ని దేశాలు విస్తరణకు ఆమోదం తెలపాలి. నాటోలో కొత్తగా చేరబోయే దేశం మెంబర్‌షిప్‌ యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేయాలి. 2008లో ఉక్రెయిన్‌ ఈ ప్లాన్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే 2010లో రష్యా అనుకూల నేత ఉక్రెయిన్‌ అధిపతి కావడంతో ప్రక్రియ అటకెక్కింది. 2014 క్రిమియా ఆక్రమణ అనంతరం ఉక్రెయిన్‌కు నాటోలో చేరాలన్న కోరిక పెరిగింది. 2017లో నాటో సభ్యత్వం కోసం ఆ దేశం రాజ్యాంగ సవరణ కూడా చేసింది.  

రష్యా బాధలు
నాటో విస్తరణపై రష్యా తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చుతోంది. ఈ కూటమి విస్తరణ తమకు హాని కలిగిస్తుందని రష్యా వాదన. అలాంటి కూటమిలో తమ సరిహద్దులోని, తమతో ఒకప్పుడు భాగమైన దేశం సభ్యత్వం తీసుకుంటే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని రష్యా నాయకత్వం భావిస్తోంది. అందుకే నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వవద్దని డిమాండ్‌ చేస్తోంది. యూఎస్, మిత్రదేశాలు ఈ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో వాటిపై ఒత్తిడి తెచ్చేందుకు యుద్ధసన్నాహాలు చేస్తోంది. నాటో వద్ద తమ దరఖాస్తు చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి గతేడాది వ్యాఖ్యానించారు. దీంతో అప్రమత్తమైన రష్యా ఈ బంధం బలపడకుండా చూసేందుకు యత్నిస్తోంది. అలాగే నాటోలో చేరబోయే దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, సరిహద్దు సమస్యలుండకూడదు. అప్పుడే సభ్యదేశాలు నూతన సభ్యత్వాన్ని పరిశీలిస్తాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో బలగాలను మోహరించడం ద్వారా ఉక్రెయిన్‌ సభ్యత్వ పరిశీలనకు రష్యా అడ్డంపడుతోంది.

కోల్డ్‌వార్‌ టైమ్‌లో కీలకపాత్ర
‘సంయుక్త సంరక్షణ’(కలెక్టివ్‌ డిఫెన్స్‌) అనేది నాటో ప్రధాన ఉద్దేశం. అంటే కూటమిలో సభ్యులెవరిపై దాడి జరిగినా కూటమిపై దాడి జరిగినట్లు భావించి ఎదురుదాడి చేస్తారు. నాటో చరిత్రలో ఒక్కసారి మాత్రమే సంయుక్త సంరక్షణ సూత్రాన్ని వాడారు. 2001 అమెరికాపై దాడుల అనంతరం నాటో దేశాల మిలటరీ విమానాలన్నీ యూఎస్‌ ఆకాశవీధుల్లో కాపలా తిరిగాయి. యూగోస్లోవియా, ఇరాక్, అఫ్గాన్‌ యుద్ధాల్లో నాటో రాజకీయ కారణాలతో పాల్గొన్నది. రష్యాతో ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో అమెరికా, మిత్రపక్షాలకు నాటో చాలా ఉపయోగపడింది. అయితే రష్యా ప్రభ కోల్పోయి, అమెరికా ఏకైక సూపర్‌ పవర్‌గా మిగిలిన తర్వాత నాటోకు ప్రాధాన్యం తగ్గింది. ప్రస్తుతం మరలా ఉక్రెయిన్‌ విషయంలో నాటో గురించి చర్చ ఆరంభమైంది.
                
– నేషనల్‌ డెస్క్, సాక్షి
 

>
మరిన్ని వార్తలు