ఇమ్రాన్‌ ఖాన్‌ నాకు పెద్దన్న

21 Nov, 2021 06:06 IST|Sakshi

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ

పాక్‌లో గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ సందర్శన  

లాహోర్‌: పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ శనివారం కర్తార్‌పూర్‌ కారిడార్‌ గుండా వెళ్లి, పాకిస్తాన్‌ భూభాగంలోని గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ను దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌–పాకిస్తాన్‌ మధ్య నూతన స్నేహ అధ్యాయం ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల నడుమ వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత్‌–పాక్‌ మధ్య పరస్పర ప్రేమను తాను ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

74 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న అడ్డుగోడలకు గవాక్షాలు తెరవాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు  కర్తార్‌పూర్‌ కారిడార్‌ను తెరిచేందుకు చర్యలు తీసుకున్న పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు సిద్ధూ కృతజ్ఞతలు తెలిపారు. అంతకముందు కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ సీఈఓ ముహమ్మద్‌ లతీఫ్‌ జీరో పాయింట్‌ వద్ద సిద్ధూకు స్వాగతం పలికారు. ఇమ్రాన్‌ ఖాన్‌ తనకు పెద్దన్న అని, తనకు గొప్ప గౌరవం, ఎంతో ప్రేమ లభించిందని సిద్ధూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

కర్తార్‌పూర్‌ కారిడార్‌ అధికారిని ఆలింగనం చేసుకొని, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తనకు పెద్దన్న అంటూ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ చేసిన వ్యాఖ్యల వీడియోను బీజేపీ సీనియర్‌ నేత అమిత్‌ మాలవియా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. సిద్ధూ గతంలోనూ పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వాను ఆలింగనం చేసుకొని, పొగడ్తల వర్షం కురిపించారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీకి సన్నిహితుడైన సిద్ధూ పాకిస్తాన్‌ నేతలను పొగడడం పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదని మాలవియా వ్యంగ్యాస్త్రాలు విసిరారు.  సిద్ధూ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీష్‌ తివారీ తప్పుపట్టారు.

పాకిస్తాన్‌ మన దేశంలోని పంజాబ్‌లోకి డ్రోన్లతో ఆయుధాలను, మాదక ద్రవ్యాలను, జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తోందని అన్నారు. అలాంటి పాక్‌ ప్రధానిని పొగడడం సరైంది కాదని హితవు పలికారు. సిద్ధూ వ్యాఖ్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి రాఘవ్‌ చద్ధా అన్నారు. పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ, ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ పాకిస్తాన్‌ పట్ల ప్రేమను దాచుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తనపై వస్తున్న విమర్శలపై సిద్ధూ స్పందించారు. వారిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకోనివ్వండి అని బదులిచ్చారు.  

మరిన్ని వార్తలు