పాక్‌ ఎన్నికల ఫలితాలు.. నవాజ్‌ షరీఫ్‌ సంచలన ప్రకటన

9 Feb, 2024 20:36 IST|Sakshi

పాకిస్థాన్‌ ఎన్నికల ఫలితాల వేళ నెలకొన్న గందరగోళం నడుమ.. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మీడియా ముందుకు వచ్చారు. అశేష సంఖ్యాక మద్దతుదారుల నడుమ.. తమ పార్టీ పీఎంఎల్‌-ఎన్‌(పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌) ఘన విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు. అయితే.. పాక్‌ ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేయకముందే.. షరీఫ్‌ స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతేకాదు.. 

అత్యధిక స్థానాలు తమ పార్టీ కైవసం చేసుకుందని తెలిపిన ఆయన.. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన బలం లేదని, సంక్షోభంతో గాయపడ్డ పాక్‌ను పునరుద్ధరించేందుకు మిగతా పార్టీలు ముందుకు రావాలని.. ప్రభుత్వ ఏర్పాటులో సహకరించాలని కోరడం గమనార్హం. ఇందుకోసం పీపీపీ(Pakistan Peoples Party) నేత పాక్‌ మాజీ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారినీ సైతం ఆయన ఆహ్వానించారు. అంటే పాక్‌ ఎన్నికల ఫలితాలు దాదాపు హంగ్‌ అనే సంకేతాను షరీఫ్‌ ఇచ్చినట్లు అర్థమవుతోంది. అంతేకాదు.. ప్రపంచంతో సంబంధాలు బలోపేతం కోసం త్వరలో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారాయన.

కానీ, ఎన్నికల్లో పీఎల్‌ఎం-ఎన్‌ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుందనేది షరీఫ్‌ స్పష్టంగా చెప్పలేదు. మొత్తం 366 స్థానాలు ఉన్న పాక్‌ జాతీయ అసెంబ్లీలో ప్రస్తుతం 265 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 133 సీట్లు రావాలి. అయితే.. పాక్‌ ఈసీ ప్యానెల్‌లో మాత్రం పీఎంఎల్‌-ఎన్‌ 61 స్థానాల దగ్గరే ఉందని తెలుస్తోంది. అయితే పాక్‌లో ఎన్నికల ఫలితాలపై.. ప్రభుత్వ ఏర్పాటుపై శనివారం ఒక స్పష్టత రావొచ్చు.  

ఒకవైపు ఇమ్రాన్‌ ఖాన్‌ పీటీఐ మద్దతుదారులు(స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి) అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నట్లు రోజంతా ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. అయితే ఈసీ మాత్రం ఇటు షరీఫ్‌ ప్రకటనను.. అటు ఇమ్రాన్‌ మద్దతుదారుల ప్రకటనను దేనిని ధృవీకరించకపోవడం గమనార్హం.

సంబంధిత వార్త: నెట్‌ కట్‌ చేస్తే..  ట్విస్టులు.. ఝలక్‌లు

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega