అవిశ్వాసానికి ముందే ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేయాలి!

3 Apr, 2022 12:12 IST|Sakshi

Nawaz Sharif Allegedly Attacked in UK: పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పై ప్రతిపక్ష పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానానికి ముందు తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇమ్రాన్‌ఖాన్‌ శనివారం దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. అంతేకాదు ఇమ్రాన్‌ ఖాన్‌ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ కుట్రకు  వ్యతిరేకంగా శని, ఆదివారాల్లో ఆందోళన చేయాలని పాకిస్తాన్ యువతని కోరారు.

మరోవైపు యూకెలో ఉన్న పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై దాడి జరిగింది. షరీఫ్‌ పై ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ కార్యకర్త దాడికి పాల్పడినట్లు పాకిస్తాన్‌ మీడియా శనివారం వెల్లడించింది. దీంతో నవాజ్‌ షరీఫ్ కూతురు,  పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ నాయకురాలు మర్యమ్ నవాజ్ షరీఫ్ ఇమ్రాన్‌ ఖాన్‌ పై నిప్పులు చెరిగారు.  ఇమ్రాన్‌ ఖాన్‌ని అవిశ్వాస తీర్మానానికి ముందే అరెస్టు చేయాలని ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు. హింసను ప్రేరేపించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయన పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి అని అన్నారు.

ఆదివారం ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభత్వం పై జరగనున్న అవిశ్వాస తీర్మానానికి ఒక రోజు ముందే నవాజ్‌ షరీఫ్‌ పై దాడి జరగడం గమనార్హం. ఇమ్రాన్‌ఖాన్‌ విదేశాల నుంచి వచ్చిన బెదిరింపు లేఖ గురించి ప్రస్తావించడమే కాకుండా దానికి ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానానికి ముడిపెట్టాడని విమర్శించారు. తమ పార్లమెంట్‌ కమిటీ కూడా ఆ పత్రాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. ప్రముఖ పాకిస్తానీ జర్నలిస్ట్ అహ్మద్ నూరానీ ట్విట్టర్‌లో.. ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ అన్ని హద్దులు అతిక్రమంచింది. శారీరక దాడిని సహించం. నవాజ్‌ షరీఫ్‌ పై  జరిగిన దాడిలో ఆయన బాడీగార్డు గాయపడ్డాడు. నిందితులను సత్వరమే పట్టుకునేలా తగిన చర్యలు తీసుకోవాలి.

(చదవండి: అవిశ్వాస’ పరీక్షలో ఇమ్రాన్‌ నెగ్గేనా?)

మరిన్ని వార్తలు