ఇమ్రాన్‌ ఇక చాలు.. వెళ్లిపో: నవాజ్‌ షరీఫ్‌

17 Oct, 2020 15:32 IST|Sakshi

ఇస్లామాబాద్‌: ‘మూడు సంవత్సరాల తర్వాత మీతో మాట్లాడుతున్నాను. ఈ 3 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి.. మీ ముఖాల్లో నవ్వు మాయమయ్యింది. నేను ఉంటే ఇలా అయ్యేది కాదు అన్నారు పాకిస్తాన్‌ మాజీ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌. ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉన్న ఆయన..‌ ఇమ్రాన్ ‌ఖాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ క‌లిసి గుజ్రాన్‌వాలాలో నిర్వహిస్తున్న ఆందోళనలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వంపైన‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ జావేద్‌ బజ్వాపైన తీవ్ర‌స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది.. నిత్యవసరాలు మొదలు బంగారం దాక అన్నింటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 10 మిలయన్ల ఉద్యోగాలు అన్నారు.. కానీ 15 మిలియన్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఐదు మిలియన్ల ఇళ్లు కట్టిస్తాం అన్నారు.. ఒక్క ఇంటిని అయినా నిర్మించారా’ అని ప్రశ్నించారు. అలానే 2018 ఎన్నికల సమయంలో బజ్వా న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి మరీ ఇమ్రాన్‌ఖాన్‌కు అధికారం కట్టబెట్టాడ‌ని న‌వాజ్ ష‌రీఫ్‌ ఆరోపించారు. (చదవండి: పాకిస్తాన్‌లో విపక్ష కూటమి)

'జావేద్‌ బజ్వా.. మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం సక్రమంగా పని చేస్తున్న మా ప్రభుత్వాన్ని కూలదోశారు. మీకు నచ్చిన వారికి ప్ర‌ధాని ప‌ద‌వి కట్టబెట్టారు' అని షరీఫ్‌ వ్యాఖ్యానించారు. కాగా, 2018 ఎన్నికల తర్వాత న‌వాజ్ ష‌రీఫ్‌ బహిరంగ సభలో‌ మాట్లాడటం ఇదే తొలిసారి. పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంపై కూడా న‌వాజ్ విమ‌ర్శ‌లు చేశారు. అప్పటి త‌మ‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం పని చేసిందని షరీఫ్‌ ఆరోపించారు. ఇప్ప‌టికైనా రాజకీయాల్లో పాక్‌‌ ఆర్మీ జోక్యం మానుకోవాలని హితవు పలికారు. దాదాపు 9 విపక్ష పార్టీలన్నీ కలిసి పాకిస్తాన్‌ డెమోక్ర‌టిక్‌‌ మూమెంట్‌ (పీడీఎం) పేరిట కూటమిని ఏర్పాటు చేసి ఇమ్రాన్‌ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతున్నాయి. ఇందులో షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్) ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న‌ది. ఆదాయానికి మించిన‌ ఆస్తుల కేసులో నవాజ్‌ షరీఫ్‌ను దోషిగా తేల్చిన పాక్‌ సుప్రీంకోర్టు ఆయ‌న‌కు 2017లో 8 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్ర‌స్తుతం అనారోగ్య కార‌ణాల‌తో లండ‌న్‌లో చికిత్స పొందుతున్నారు. (చదవండి: ఇమ్రాన్‌ అసమర్థుడు.. రాజీనామా చేయాల్సిందే)

ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వం ఇటీవ‌ల‌‌ చేపట్టిన సంస్కరణలవల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న‌దని, ఆర్థిక మాంద్యం రెండు అంకెలకు చేరిపోయిందని న‌వాజ్ ష‌రీఫ్ విమ‌ర్శించారు. 'మీ టైం ఆయిపోయింది ఇమ్రాన్‌ ఇక వెళ్లండి' అని వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌లు కూడా 'మీ  టైం అయిపోయింది ఇమ్రాన్ ఇక వెళ్లండి' అంటూ పెద్ద పెట్టున‌ నినాదాలు చేశారు. ఇమ్రాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.

మరిన్ని వార్తలు