బొగ్గు వినియోగం నిలిపివేతపై ఇంకా అస్పష్టత

14 Nov, 2021 05:23 IST|Sakshi

గ్లాస్గో: భూతాపం(గ్లోబల్‌ వార్మింగ్‌)పై పోరాటానికి తీసుకోవాల్సిన చర్యలపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వాతావరణ సదస్సు తుది నిర్ణయానికి రాలేదు. గ్లాస్గోలో కాప్‌–26 వాతావరణ సదస్సు ముగిసిపోయినప్పటికీ తాజా ప్రతిపాదనలు  తెరపైకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బొగ్గు వాడకానికి, శిలాజ ఇంధనాల వినియోగానికి స్వస్తి పలకాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునివ్వాలన్న సూచనలను పరిశీలిస్తున్నట్టు శనివారం విడుదల చేసిన ముసాయిదా ప్రకటన స్పష్టం చేసింది.  కాప్‌–26 నిర్ణయాలను 197 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంటుంది.

అప్పుడే అవి అమల్లోకి వస్తాయి. అందుకే సదస్సు ముగిసిన తర్వాత కూడా అతి పెద్ద దేశాలు చర్చల ప్రక్రియని ముందుకు తీసుకువెళతాయి. కాప్‌–26 శిఖరాగ్ర సదస్సుకి నేతృత్వం వహించిన బ్రిటన్‌ మంత్రి, భారత సంతతికి చెందిన అలోక్‌ శర్మ ప్రపంచ దేశాలన్నీ వాతావరణ మార్పులపై అత్యుత్తమ పరిష్కారాన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలేవీ భూతాపం పెరుగుదలను నిరోధించలేవని, మరిన్ని గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కాప్‌–26లో పాల్గొన్న పర్యావరణ నిపుణులు భావిస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు