Ned Davis Research: ముంచుకొస్తున్న మాంద్యం

27 Oct, 2022 04:49 IST|Sakshi

వచ్చే ఏడాదికల్లా ప్రపంచాన్ని కమ్మేస్తుంది: ఆర్థికవేత్తలు

సంపన్న దేశాల్లోనూ ఆర్థిక వృద్ధి నేల చూపులు

ఆ దెబ్బకు చిన్న దేశాల పుట్టి మునగడం ఖాయం

ప్రపంచాన్ని మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. వచ్చే ఏడాదికల్లా ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసేలా కన్పిస్తోంది. కరోనా దెబ్బ నుంచి కోలుకోకముందే వచ్చిపడ్డ రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం తదితరాలతో ఆర్థిక వృద్ధి క్రమంగా కుంటుపడుతూ ప్రధాన దేశాలన్నీ మాంద్యం వైపు అడుగులేస్తున్నాయి....

(డి.శ్రీనివాసరెడ్డి) ప్రపంచం ఆర్థిక మాంద్యం బారిన పడటం ఖాయమని ఫ్లోరిడాకు చెందిన నెడ్‌ డేవిస్‌ రీసెర్చ్‌ చెబుతోంది. మాంద్యాన్ని అంచనా వేయడంలో ఈ సంస్థ అందెవేసిన చేయి. దాని లెక్క ప్రకారం వచ్చే ఏడాదికల్లా ప్రపంచం మాంద్యం గుప్పెట్లో చిక్కేందుకు 98.1 శాతం ఆస్కారముంది. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ జూలైలో చేసిన సర్వేలో మాంద్యం తప్పదని 49 శాతం ఆర్థికవేత్తలు పేర్కొనగా అక్టోబర్‌లో వారి సంఖ్య 63 శాతానికి పెరిగింది!

12 నెలల్లోపే అమెరికా మాంద్యం కోరల్లో చిక్కడం ఖాయమని సర్వే తేల్చింది. వర్ధమాన దేశాలపై ఇది సుదీర్ఘ ప్రభావమే చూపవచ్చని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మాల్ఫాస్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా, యుద్ధం, వాతావరణ విపరణామాలు ప్రపంచాన్ని అంధకారంలోకి నెడుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎండీ క్రిస్టలినా జార్జివా హెచ్చరించారు.

కుంటినడకన ఆర్థికం...
చాలా దేశాల్లో జీడీపీ వృద్ధిరేటు నానాటికీ పడిపోతోంది. 2022లో ప్రపంచ ఆర్థిక పురోగతి రేటు 6.1 శాతముంటే 2023 నాటికి ఏకంగా సగానికి సగం పడిపోయి 3.2 శాతానికి పరిమితం కావచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. సంపన్న దేశాల ఆర్థిక వృద్ధి కూడా నేల చూపులే చూస్తోంది. యూరప్‌ జీడీపీ 1.2 శాతానికి, బ్రిటన్‌ కేవలం 0.3, ఫ్రాన్స్‌ 0.7కు పరిమితం కావచ్చని అంచనా. సవరించిన వృద్ధి రేట్ల ప్రకారం చూసినా అమెరికా 1 శాతం, చైనా 3.2 శాతంతో సరిపెట్టుకునేలా ఉన్నాయి. 2016తో పోలిస్తే ప్రపంచ జీడీపీ 23 శాతం పెరగాలన్నది అంచనా కాగా కరోనా, యుద్ధం తదితరాల దెబ్బకు 17 శాతానికే పరిమితమైంది. ఇలా పడిపోయిన ఉత్పాదకత విలువ ఏకంగా 17 లక్షల కోట్ల డాలర్లు. అంటే ప్రపంచ ఆదాయంలో ఏకంగా 20 శాతం!

ఎందుకీ దుస్థితి...?
కరోనా, యుద్ధం నేపథ్యంలో విపరీతంగా పెరిగిపోయిన ధరలకు కళ్లెం వేసేందుకు ఈ ఏడాది ఏకంగా 90 దేశాల సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేశాయి. ఈ దెబ్బకు ఉత్పాదకత తగ్గడంతో పెట్టుబడులు, వినియోగం పడిపోయి మాంద్యం ముంచుకొస్తోంది. ధరల అదుపు కోసమని పదేపదే వడ్డీ రేట్లు పెంచితే మాంద్యం బారిన పడక తప్పదని జార్జ్‌ వాషింగ్టన్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ పావ్‌లిన్‌ టియెన్‌ అన్నారు. అమెరికా ఫెడరల్‌ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపుతో 90 దేశాల కరెన్సీ విలువలు పతనమయ్యాయి. గతేడాది 125.7గా ఉన్న ఆహారోత్పత్తుల ధరల సూచీ ఈ ఏడాది 146.94 పాయింట్లకు పెరిగింది. మాంద్యం దెబ్బకు కంపెనీలు నియామకాలకు కత్తెర వేస్తున్నాయి. అమెరికాలో నిరుద్యోగిత వచ్చే డిసెంబర్‌ నాటికి 3.7 శాతానికి, 2023 జూన్‌కల్లా 4.7కు పెరుగుతుందని అంచనా.

మాంద్యమంటే...
మామూలు పరిభాషలో వరుసగా రెండు త్రైమాసికాలు గనక జీడీపీ తిరోగమనంలో సాగితే ఆ దేశంలో మాంద్యంలోకి జారుకున్నట్టు పరిగణిస్తారు.  

ఇవీ సంకేతాలు...
► సుదీర్ఘంగా సాగేలా కన్పిస్తున్న రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం
► డాలర్‌ ముందు కుదేలవుతున్న అన్ని దేశాల కరెన్సీలు
► చుక్కలనంటుతున్న ద్రవ్యోల్బణం
► వడ్డీరేట్లను పెంచేస్తున్న అన్ని దేశాల సెంట్రల్‌ బ్యాంకులు
► నియామకాలు బాగా తగ్గిస్తున్న కార్పొరేట్‌ సంస్థలు
► నానాటికీ మందగిస్తున్న ప్రపంచ ఆర్థిక వృద్ధి

మనకూ తిప్పలే...
మన జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది 6.8 శాతం ఉంటుందని, 2023లో 6.1 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్‌ నివేదిక పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇది మెరుగేనని కితాబిచ్చింది. కానీ మాంద్యం ఎఫెక్ట్‌ భారత్‌పైనా గట్టిగానే ఉంటుందని అంచనా. అమెరికాకు మన ఎగుమతులు 2011 10.1 శాతముంటే ఇప్పుడు 18.1 శాతానికి పెరిగాయి. మన సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో ఏకంగా 54.8 శాతం అమెరికాకే వెళ్తున్నాయి. అగ్రరాజ్యం మాంద్యంలో చిక్కితే వీటిపై గట్టి ప్రభావమే పడుతుంది. మన విదేశీ మారక నిల్వలు వరుసగా తొమ్మిదో వారమూ తిరోగమన దిశలో ఉన్నట్టు అక్టోబర్‌ 7నాటి నివేదికలో రిజర్వ్‌ బ్యాంకే పేర్కొంది. అమెరికాతో భారత వాణిజ్య లోటు 3.8 శాతానికి ఎగబాకుతుందని అంచనా!

మరిన్ని వార్తలు